Begin typing your search above and press return to search.

బోత్ ఆర్ నాట్ సేమ్‌.. చిరు-చంద్ర‌బాబుల పిక్ వైర‌ల్‌..

By:  Tupaki Desk   |   11 Feb 2022 3:18 PM GMT
బోత్ ఆర్ నాట్ సేమ్‌.. చిరు-చంద్ర‌బాబుల పిక్ వైర‌ల్‌..
X
సోష‌ల్ మీడియాలో ఒక ఫొటో తెగ వైర‌ల్ అవుతోంది. టీడీపీ కేడ‌ర్‌, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ దీనిని భారీ ఎత్తున వైర‌ల్ చేస్తున్నారు. దీనికి బాల‌కృష్ణ ఇటీవ‌ల సినిమా అఖండ‌లోని `బోత్ ఆర్ నాట్ సేమ్‌` అనే డైలాగును కూడా జోడించారు. ఇంత‌కీ ఈ ఫొటోలో ఏముందంటే.. టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో చిరంజీవి ఉన్న ప్ప‌టి ఫొటోను.. అదేవిధంగా ప్ర‌స్తుత సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ తో తాజాగా చిరు భేటీ అయిన ఫొటోను జ‌త‌క‌లిపి వైర‌ల్ చేస్తున్నారు.

చిరంజీవికి చంద్రబాబు నాయుడుతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి, ఆయ‌న‌ మాజీ సిఎం చంద్ర‌బాబుతో అనేక సంద‌ర్భాల్లో ఉత్సాహంగా గ‌డిపారు. అనేక విష‌యాల‌ను కూడా పంచుకున్నాడు, అదేవిధంగా ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు స‌ర‌దాగా ఉన్నారు. ఎక్క‌డా ఇటు చంద్ర‌బాబు అధికార ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ‌లేదు. అటు చిరు కూడా నేను మెగాస్టార్ అనే భావ‌న‌ను ప్ర‌ద‌ర్శించ‌లేదు. చంద్ర‌బాబు నాయుడు, చిరంజీవి తమ సొంత రంగాలలో ఉన్నత స్థానాలు సాధించినందుకు ఒకరినొకరు గౌరవించుకున్నారు. ఇద్దరూ చాలా స్నేహపూర్వకంగా మెలిగారు.

సీఎం జగన్, చంద్ర‌బాబు నాయుడిలా స్నేహశీలిగా లేర‌ని, గంభీరంగా.. అధికార ద‌ర్పంతో ఉన్న‌ట్టుగా ఉన్నార‌ని.. ఇక‌, చిరంజీవి ముఖ్యమంత్రి ముందు చేతులు జోడించి కనిపిస్తున్నాడని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని కోట్ల మంది ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకున్నాన‌ని.. అఖండ మెజారిటీ సాధించాన‌ని చెప్పుకొనే జ‌గ‌న్‌.. త‌న క‌న్నా ఎక్కువ‌గా చిరును ప్ర‌జ‌లు త‌మ గుండెల్లో దాచుకున్న విష‌యాన్ని మాత్రం మ‌రిచిపోయార‌ని చిరు అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

చిరంజీవిని సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా గౌరవిస్తారు. జగన్‌ను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భారీ మెజారిటీతో ఎన్నుకున్నట్లే చిరును మొత్తం సినిమా రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న‌టుడిగా గుండెల్లో పెట్టుకున్నారు. వారిద్దరూ సమానమేనని, ఎవ‌రూ మరొకరికి లోబడి ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని నెటిజన్ అభిప్రాయపడ్డారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.