అక్కడ రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ కాబోతున్న 'ది ఘోస్ట్'

Fri Sep 30 2022 22:45:19 GMT+0530 (India Standard Time)

Vikram The Ghost Hindi Teaser

ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలు బాలీవుడ్ మార్కెట్ లో మంచి వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. 'పుష్ప' - 'ఆర్.ఆర్.ఆర్' - 'మేజర్' - 'సీతారామం' - 'కార్తికేయ 2' వంటి సినిమాలు హిందీలో కూడా విడుదలై.. నార్త్ సర్క్యూట్స్ లో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ఉత్తరాది మార్కెట్ మీద దృష్టి సారిస్తున్నారు. దసరా బరిలో నిలిచిన 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుండగా.. ఇప్పుడు 'ది ఘోస్ట్' మూవీ కూడా అదే బాటలో వెళ్తోంది.కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ''ది ఘోస్ట్''. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా వచ్చిన రిలీజ్ ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది.

నాగ్ ను ఒక ఇంటెన్స్ రోల్ లో ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. హై ఆక్టీన్ యాక్షన్ - స్టైలిష్ మేకింగ్ - స్టన్నింగ్ విజువల్స్ తో మెస్మరైజ్ చేసాడు. దీంతో 'ది ఘోస్ట్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకున్నారు. ఇది కచ్చితంగా నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందని భావించారు. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటుగా హిందీ - తమిళ భాషల్లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

''విక్రమ్: ది ఘోస్ట్'' అనే టైటిల్ తో గోల్డ్ మైన్స్ టెలీ ఫిలిమ్స్ తో కలిసి మనం ఎంటర్ప్రైజెస్ - శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై హిందీలో రిలీజ్ చేస్తున్నారు. 'మనం ఎంటర్ప్రైజెస్' అనే సంస్థ నాగార్జున కు చెందినదే అనే టాక్ ఉంది. అయితే తెలుగుతో పాటుగా కాకుండా రెండు రోజులు ఆలస్యంగా విడుదల చేస్తుండటం గమనార్హం.

'ది ఘోస్ట్' చిత్రాన్ని తెలుగు - తమిళ భాషల్లో దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తుండగా.. హిందీ వెర్సన్ ''విక్రమ్: ది ఘోస్ట్'' ను మాత్రం అక్టోబర్ 7వ తారీఖున థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హిందీ టీజర్ ను విడుదల చేశారు. దీనికి ఉత్తరాది ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

నాగార్జున కు బాలీవుడ్ లో ఎప్పటి నుంచో మంచి క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. 'శివ' సినిమాతో హిందీలో సత్తా చాటిన నాగ్.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. 'మాస్' 'డాన్' వంటి సినిమాలు హిందీలో డబ్ కాబడి టీవీ ఛానల్స్ మరియు యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అందుకే నాగార్జున ను ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ పేర్కొంటుంటారు.

చాలా గ్యాప్ తర్వాత ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమాతో నాగార్జున మళ్లీ బాలీవుడ్ జనాలు మాట్లాడుకునేలా చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ''విక్రమ్: ది ఘోస్ట్'' సినిమాతో హిందీ మార్కెట్ ను టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో బాలీవుడ్ నటి గుల్ పనాగ్ కీలక పాత్ర పోషించింది. 'పుష్ప' వంటి తెలుగు మూవీతో నార్త్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న గోల్డ్ మైన్స్.. ఇప్పుడు కింగ్ నాగ్ తో కలిసి ఎలాంటి విజయాన్ని సాధిస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.