రాజ్యసభ గౌరవం.. సింపుల్ అనేసిన విజయేంద్రుడు!

Thu Jul 07 2022 13:00:01 GMT+0530 (India Standard Time)

Vijayendra Prasad Rajya Sabha Respect

మిడతలు ఎగిరెగిరి పడుతుంటే చీమలు మాత్రం ధాన్యం గింజల్ని పోగేసుకుంటాయి. అవి వాటి పనిని అవి చేసుకుని పోతుంటాయి. అందువల్ల కాలంతో సంబంధం లేకుండా చీమలు బతికి బట్టగట్టగలుగుతాయి. ఏదో సాధించామని ఎగిరిపడితే కిందపడడం ఖాయమని చాలామంది విషయంలో చూస్తూనే ఉంటాం.అందుకేనేమో.. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రియాక్షన్ అలా ఉంది. బిజెపి నేతృత్వంలోని కేంద్రం అతన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ గౌరవం అందుకున్న ఆయనను అభినందించేందుకు వెళ్లిన వారికి చాలా వింతైన అనుభవం ఎదురైంది. అసలు ఆయన ఒక సాధారణ యోగి పుంగవుడినే తలపించాడట. దీని గురించి మీడియా వ్యక్తులు  మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు కూడా వింతైన అనుభవాలు ఎదురయ్యాయని తెలిసింది. అసలు ఆయన దీనికి స్పందిస్తేనే కదా..!

రాజ్యసభ నామినేషన్ గురించి ఆయన ప్రతిస్పందనను అడగ్గానే..పలువురు మీడియా పెద్దలకు ఊహించని షాక్ తగిలిందట. ''ఇది చాలా సాధారణమైనది .. నాకు నిద్ర వస్తోంది!'' అని విజయేంద్రుడు అన్నారట. నామినేట్ అయ్యాను కదా.. ఇప్పుడు దేశం కోసం ఏదైనా చేయాలి అని విజయేంద్ర ప్రసాద్ సంతోషం వ్యక్తం చేసారు. కానీ ఇదేమీ వింతైనది కాదు.. చాలా సాధారణమైనది అని ఆయన అన్నారు.

టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ లో విజయేంద్రుడు అగ్ర రచయితగా సత్తా చాటుతున్నారు. బాహుబలి -RRR వంటి సంచలనాలకు కథలు అందించిన ఆయన హిందీ పరిశ్రమ కోసం భజరంగి భాయిజాన్- మణికర్ణిక లాంటి చిత్రాలకు కథలు అందించారు.

కోలీవుడ్ లో తలైవి స్టోరీని కంగనకు అందించింది ఆయనే. ఇండస్ట్రీ బెస్ట్ సినిమాలకు 1000 కోట్ల క్లబ్ చిత్రాలకు ఆయన కథలు రాస్తుంటే చెడగొట్టేందుకు ఇప్పుడు రాజ్యసభ కు నామినేట్ చేస్తున్నారు! అని విమర్శించేవాళ్లు లేకపోలేదు.

అందుకే ఆయన ఇవేమీ పట్టనట్టు తన పనిలో తాను ఉన్నారు. ఇక రాజమౌళి అయితే అసలే స్పందించడం లేదు. ఏదో 'మమ' అనేయడం తప్ప అదేదో గొప్ప కిరీటం పెట్టినట్టు భావన అయితే లేదు. విజయేంద్రుని కుటుంబం గప్ చుప్ గా ఉంది. అర్హత సాధిస్తే దానిని అఛీవ్ మెంట్ అనుకుని కప్ బోర్డ్ లో పెట్టుకోవడమే ఉత్తమ లక్షణం అని భావిస్తోంది ఆ ఫ్యామిలీ.

ఇక రాజ్యసభ గౌరవం అందుకోవడం కంటే రాజకీయరంగంలో ఏదైనా ఇన్నోవేటివ్ గా చేసి ప్రజల మన్ననలు పొందడం చాలా కష్టమైనది. దానికోసం కృషి చేయాలని విజయేంద్రుడు భావిస్తున్నారట. అయితే తెలుగు సినిమాని పాన్ ఇండియా సినిమాగా ఎత్తుకి ఎదిగేలా చేసిన అలాంటి రచయిత రాజకీయాల పేరుతో ఇండస్ట్రీకి దూరమైతే మాత్రం సహించలేమని అభిమానులు అంటున్నారు. అందువల్ల ఆయన మహేష్ - రాజమౌళి మూవీ స్క్రిప్టు పైనే దృష్టి సారిస్తున్నారట.