సంక్రాంతి రేసులోకి మరో క్రేజీ మూవీ..!

Sun Sep 25 2022 09:34:24 GMT+0530 (India Standard Time)

Vijay Thalapathy Varasudu Movie

టాలీవుడ్ లో సంక్రాంతి బెర్తుల కోసం గట్టి పోటీ ఏర్పడింది. పెద్ద సినిమాలన్నీ పండగని లక్ష్యంగా చేసుకొని బరిలో దిగడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పటికే 'ఆది పురుష్' 'మెగా 154' లాంటి క్రేజీ చిత్రాలు రిలీజ్ డేట్లు లాక్ చేసుకున్నాయి.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ''ఆది పురుష్'' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. తెలుగు హిందీలతో పాటుగా పలు ఇతర బాషల్లో విడుదల కానుంది. దసరా నుంచి ఈ మైథలాజికల్ డ్రామాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలు కానున్నాయి.

ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమా తెరకెక్కుతోంది. టీ సిరీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది రామాయణ ఇతిహాసం ఆధారంగా తీస్తున్న సినిమా. ఇందులో ప్రభాస్ రాఘవగా.. జానకి గా కృతి సనన్ నటించనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' సినిమాని కూడా సంక్రాంతి రేసులోకి తీసుకొస్తున్నారు. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మెగా154 సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఇందులో మాస్ అవతార్ లో కనిపించనున్నారు.

ఇకపోతే పొంగల్ రేసులోకి రావడానికి మరో క్రేజీ మూవీ కూడా రెడీ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న 'వారసుడు' అనే తెలుగు తమిళ ద్విభాషా చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

'వారసుడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పీవీపీ సినిమాస్ సహకారంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. ఈరోజు ఆదివారం నుంచి ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.

కేవలం 2 యాక్షన్ సీక్వెన్సులు మరియు 2 పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయని.. సంక్రాంతి రిలీజ్ ని టార్గెట్ పెట్టుకుని ఈ ఫైనల్ షెడ్యూల్ తో చిత్రీకరణ అంతా పూర్తి చేస్తామని మేకర్స్ తెలిపారు. దీంతో పెద్ద పండక్కి బాక్సాఫీస్ వద్ద మూడు పెద్ద సినిమాలు పోటీ పడే పరిస్థితి ఏర్పడుతోంది.

కాగా 'వారసుడు' సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభు - శరత్ కుమార్ - ప్రకాష్ రాజ్ - జయసుధ - శ్రీకాంత్ - కిక్ శ్యామ్ - యోగి బాబు - సంగీత - సంయుక్త షణ్ముగం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది విజయ్ కు తొలి తెలుగు సినిమా. తమిళ్ లో 'వారిసు' అనే పేరుతో విడుదల చేయనున్నారు.