రౌడీ గారు వీళ్లను లైట్ తీస్కున్నారా?

Mon Feb 17 2020 07:00:01 GMT+0530 (IST)

Vijay Deverakonda on about His Directors

కొత్తొక వింత పాతొక రోత! అన్నట్టుగానే తనకు కెరీర్ ఆరంభమే వరుస హిట్లు ఇచ్చిన డైరెక్టర్లను విజయ్ దేవరకొండ మర్చిపోయాడా? అసలు వాళ్లకు తిరిగి రెండో అవకాశమే కల్పించడం లేదేమిటి? అంటే.. ఇందుకు రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి.పెళ్లి చూపులు లాంటి క్లాసిక్ హిట్ ని తన కెరీర్ కి ఇచ్చాడు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత అతడిని హీరోని చేసి రుణం తీర్చుకున్నానని అనుకున్నా.. తరుణ్ భాస్కర్ నటుడిగా వెలిగే పరిస్థితి ఏమీ కనిపించలేదు. కనీసం తనకు దర్శకుడిగా మరో ఛాన్సిస్తాడేమో చూడాలి. అలాగే అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని తనకు రైట్ టైమ్ లో అందించాడు సందీప్ రెడ్డి వంగా. కనీసం ఆ సినిమాకి సీక్వెల్ అయినా ప్రకటించలేదు. సందీప్ బాలీవుడ్ సినిమా చేశాక అయినా విజయ్ తో మరో సినిమా ప్రస్థావన తేలేదు ఎందుకనో. అలాగే గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన పరశురామ్ తోనూ దేవరకొండ ప్రాజెక్టు రిపీటవ్వలేదు. గీత గోవిందం సీక్వెల్ కథ తో మళ్లీ ఈ కాంబినేషన్ కలిసే వీలుందా? అంటే అందుకు కనీస హింట్ అయినా లేదు. మహానటి లో ఓ క్లాస్ టచ్ ఉన్న రెట్రో రోల్ లో అవకాశం కల్పించాడు. ఎవడే సుబ్రమణ్యం లాంటి ఇనిషియల్ కెరీర్ సక్సెస్ ని ఇచ్చిన నాగ్ అశ్విన్ తో మరో సోలో సినిమాని ప్రకటించనేలేదు.

ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరితో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అయినా తన కెరీర్ జర్నీలో కీలకమైన దర్శకులకు అవకాశాలిస్తాడా? అన్నది చూడాలి. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్` మిక్స్ డ్ టాక్ నిరాశపరిచింది. నోటా తర్వాత మరోసారి ఫ్లాప్ అన్న టాక్ ఉంది. నటించిన తొమ్మిదిలో మూడు బ్లాక్ బస్టర్లు .. ఒకట్రెండ్ యావరేజ్ లు.. మూడు ఫ్లాపులు ఉన్నాయి. ఇక పూరితో పాన్ ఇండియా ఫైటర్ రిజల్ట్ ఎలా ఉంటుంది? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ఈ సినిమా ఫలితంపై చాలా హోప్స్ ఉన్నాయి. అటుపై తిరిగి గీత గోవిందం దర్శకుడితోనో లేదా అర్జున్ రెడ్డి దర్శకుడితోనో సినిమా చేస్తేనే విజయ్ కి మళ్లీ అంత బిగ్ బూస్ట్ దొరుకుతుందేమో!