వివాదాలే కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయా..?

Tue Aug 09 2022 11:14:41 GMT+0530 (IST)

Vijay Devarkonda Publicity

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ''లైగర్''. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో విజయ్ దేవరకొండ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు నగరాలు పర్యటిస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తున్నాడు. ఇక VD చిత్రాల చుట్టూ ఎప్పుడూ ఏదొక వివాదం చెలరేగుతూ ఉంటుంది. మూవీ ప్రమోషన్స్ లో అతని కామెంట్స్ హాట్ టాపిక్ అవుతుంటాయి.

ఇప్పుడు 'లైగర్' విషయంలోనే అదే జరుగుతోంది. బోల్డ్ పోస్టర్ వదలడం దగ్గర నుంచి ప్రమోషన్స్ లో విజయ్ వ్యాఖ్యల వరకూ వివాదాలు జోరుగా సాగుతున్నాయి. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా గులాబీ గుచ్చాన్ని అడ్డుపెట్టుకుని వీడీ ఫోజులు ఇవ్వడంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఈ సమయంలో నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేశారు.

అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాట్ లగా దేంగే అంటూ ముందుకు వెళ్తున్నాడు విజయ్. ట్రైలర్ ఈవెంట్ లో 'మీకు మా అయ్య తెల్వదు.. మా తాత తెల్వదు' అని రౌడీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే లేపాయి. దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా 'అయ్యా తాత ఎవ్వడ్ తెల్వదు' అంటూ హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేయడం వివాదం మరింత ముదిరేలా చేసింది.

ఇదే క్రమంలో 'లైగర్' సినిమా నుంచి 'ఆఫత్' సాంగ్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ పేర్కొన్న క్యాప్సన్ పై కూడా ఫెమినిస్టులు సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 'తల్లీ కొడుకుల మధ్య ఎప్పుడూ ఒక బ్యూటీఫుల్ డ్రామా క్వీన్ ఉంటుంది' అనే క్యాప్సన్ వివాదం రేపింది.

అలానే విజయ్ దేవరకొండ ఇటీవల 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో బోల్ట్ ఆన్సర్స్ ఇవ్వడంపై ఓ వర్గం వారు నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇలా 'లైగర్' చుట్టూ అనేక కాంట్రవర్సీలు వచ్చాయి. అయితే ఇవన్నీ పరోక్షంగా సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయని తెలుస్తోంది.

గతంలో 'అర్జున్ రెడ్డి' సినిమా విషయంలోనూ అనేక వివాదాలు చెలరేగాయి. అయితే ఆ మూవీపై బజ్ ఏర్పడటానికి హెల్ప్ అయింది.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే ఆగస్ట్ 25న రిలీజ్ కాబోతోన్న 'లైగర్' సినిమాకు అదే జరుగుతోంది.

కాంట్రవర్సీలన్నీ సోషల్ మీడియాలో ఈ మూవీ పై సందడి నెలకొనేలా చేస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సర్కిల్స్ లో విజయ్ దేవరకొండ హాట్ టాపిక్ గా మారాడని తెలుస్తోంది. ముంబైలో ఎక్కిడికి వెళ్లినా అతనికి గ్రాండ్ వెల్కమ్ లభిస్తోంది. దీన్ని బట్టి వివాదాలు కూడా వీడీ చిత్రానికి ప్లస్ అవుతున్నాయని అనుకోవాలి. మరి ఇది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.

'లైగర్' చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. మైక్ టైసన్ - రమ్యకృష్ణ - విషు రెడ్డి కీలక పాత్రలు పోషించారు. పూరీ జగన్నాధ్ - ఛార్మీ కౌర్ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ బాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.