సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండండి: విజయ్

Mon Jan 20 2020 13:28:15 GMT+0530 (IST)

Vijay Devarakonda Warning to People from Matrimony Fraud Cyber Crime Ad

ఈ సమాజంలో అబద్దం లేనిదెక్కడ.. మోసం లేనిదెక్కడ? గాలి ఎలా మన చుట్టూ ఉంటుందో అలానే మోసం కూడా మన చుట్టూ ఉంటుంది. అయితే చాలామంది గాలి కనపడదు కదా.. మోసం కూడా అలానే ఉండదులే అనుకుంటారు అక్కడే పప్పులో కాలేస్తారు. పెళ్లిసంబంధాలు చూసే సైట్లలో మోసగాళ్ళు ఎక్కువమందే ఉంటారు. తప్పుడు ప్రోఫైల్స్ పెట్టి జనాల దగ్గర డబ్బు గుంజడానికి రెడీగా ఉంటారు. ఎంతోమంది అమాయకులు ఇలాంటి మోసాలకు గురవుతూ డబ్బు పోగొట్టుకుంటారు. ఈ అంశంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ వారు అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కార్యకమానికి యువ హీరో విజయ్ దేవరకొండ తన సహకారం అందించడం విశేషం.ఈమధ్యే ఈ అంశం పై విడుదల చేసిన యాడ్ లో విజయ్ దేవరకొండ ఫేక్ ప్రోఫైల్స్ చూసి నమ్మి మోసపోవద్దని సూచించాడు. యాడ్ ప్రారంభంలో ఒక వ్యక్తి తను వివాహం చేసుకోబోయే అమ్మాయికి ఏదో డబ్బు అవసరమని రెండు లక్షలు ట్రాన్స్ ఫర్ చేశానని తన స్నేహితుడితో చెప్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు నీకు పెళ్లి ఫిక్స్ అయిందా అని అడుగుతాడు. అవును.. ఈ అమ్మాయే అంటూ తన ఫోన్ లో ఫియాన్సీ ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూడగానే అవాక్కయిన ఆ ఫ్రెండు.. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా ఫ్రెండ్ ను కూడా మోసం చేసిందిరా అంటాడు. దీంతో సదరు మ్యాట్రిమోని సుందరి ఓ మేలు జాతి కంత్రీ అని అర్థం అయ్యి తల పట్టుకుంటాడు.

సరిగ్గా ఈ సమయంలో విజయ్ ఎంట్రీ ఇచ్చి "ఒక షర్టు కొనడానికి వెళ్లినప్పుడు ఆ బ్రాండ్ ఏంటి.. ఆ మెటీరియల్ ఏంటి.. క్వాలిటీ ఏంటి అని వందసార్లు ఆలోచించే మనం పెళ్లికొచ్చేసరికి ఎందుకంత అజాగ్రత్తగా ఉంటాం? ఒక అమ్మాయి లేదా అబ్బాయి ప్రొఫైల్ చూసినప్పుడు వాళ్ల శాలరీ ఎంత.. వాళ్లు అందంగా ఉన్నారని కక్కుర్తి పడకండి. అసలు వాళ్లు నిజంగా ఉన్నారా.. జెన్యూనా కాదా చూసుకోండి.. అరా తీయండి.. సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండండి" అంటూ జాగ్రత్తలు చెప్పాడు. విన్నారు కదా.. కక్కుర్తి పడకండి!