Begin typing your search above and press return to search.

రానా వదిలిన విజయ్ ఆంటోనీ 'విజయ రాఘవన్' ట్రైలర్..!

By:  Tupaki Desk   |   2 Aug 2021 1:32 PM GMT
రానా వదిలిన విజయ్ ఆంటోనీ విజయ రాఘవన్ ట్రైలర్..!
X
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోని. 'నకిలీ' 'డా.సలీమ్‌' 'బిచ్చగాడు' 'భేతాళుడు' 'ఇంద్రసేన' 'రోషగాడు' 'కిల్లర్‌' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో విజయ్‌ ఆంటోని నటిస్తున్న ప్రతీ చిత్రాన్ని తెలుగు లోకి డబ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆంటోనీ హీరోగా నటిస్తున్న 'కోడియిల్‌ ఒరువన్‌' అనే చిత్రాన్ని ''విజయ రాఘవన్‌'' పేరుతో ఇక్కడ విడుదల చేయనున్నారు. ఇది వరకే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ - టీజర్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను హీరో రానా దగ్గుబాటి విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

ఒక స్లమ్ ఏరియాకి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఓ టీచర్.. తప్పుదోవ పట్టిన అక్కడి పిల్ల‌లకు, చ‌దువు గొప్ప‌త‌నాన్ని వివ‌రించి వారి అభ్యున్న‌తికి పాటు ప‌డటమే ''విజయ రాఘవన్‌'' కథ అని తెలుస్తుంది. ఈ క్రమంలో రౌడీలతో రాజకీయ నాయకులను ఎదిరించి అతను ఎలా పోరాడాడు అనేది ఇందులో చూపించనున్నారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ పై నాయకులపై ఇందులో కొన్ని సెటైర్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హీరో అసెంబ్లీలో మాట్లాడటం చూస్తుంటే.. ఓ టీచర్ పొలిటికల్ లీడర్ గా మారి, సిస్టమ్ లో ఎలాంటి మార్పు తెచ్చాడనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారని అర్థం అవుతుంది.

'పాడవకుండా ఆధార్ కార్డ్ ని కూడా లామినేషన్ చేసి ఇస్తారు.. కానీ మా జీవితాలను ఎవరూ పట్టించుకోరు' వంటి కొన్ని డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో యాక్షన్ కు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు ట్రైలర్ లో తెలుస్తుంది. విజయ్ ఆంటోనీ సరసన ఆత్మిక హీరోయిన్ గా కనిపిస్తోంది. 'బహుబలి' ప్రభాకర్ - 'కేజీయఫ్' గరుడ రామ్ - స‌చిన్ ఖేడ్కర్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మొత్తం మీద ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంటూ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.

''విజయ రాఘవన్‌'' చిత్రానికి ఆనంద కృష్ణన్‌ దర్శకత్వం వహించారు. 'మెట్రో' వంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్.. 'విజయ రాఘవన్' చిత్రంలో మరో వైవిధ్యమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ పై టి.డి. రాజా - డి.ఆర్‌. సంజయ్‌ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం సమకూర్చిన ఈ మూవీకి ఉదయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. హీరో విజయ్ ఆంటోనీ స్వయంగా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'బిచ్చగాడు' తర్వాత ఆ స్థాయి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ కు.. ''విజయ రాఘవన్'' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.