'విడుదలై' ఫస్ట్ లుక్: జాతీయ ఉత్తమ దర్శకుడితో విజయ్ సేతుపతి..!

Thu Apr 22 2021 13:03:11 GMT+0530 (IST)

Viduthalai First Look Released

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి తన విలక్షమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ 'మక్కల్ సెల్వన్' గా మారిపోయాడు. చేతి నిండా సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా ఉండే సేతుపతి.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ''విడుదలై'' అనే టైటిల్ ని ఖరారు చేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.''విడుదలై'' చిత్రంలో మెంటర్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారని.. ప్రముఖ తమిళ హాస్యనటుడు సూరి కథానాయకుడిగా నటిస్తున్నాడని మేకర్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సేతుపతి సంకెళ్లతో ఖైదీ గెటప్ లో పోలీసుల మధ్య కూర్చొని టీ తాగుతూ కనిపిస్తున్నాడు. మరో పోస్టర్ లో పోలీస్ గా నటిస్తున్న సూరి భుజంపై తుపాకీ పెట్టుకుని నిల్చున్నాడు. ఫస్ట్ లుక్ తోనే 'అసురన్' డైరెక్టర్ వెట్రిమారన్ - విజయ్ సేతుపతి - సూరి కలిసి వైవిధ్యమైన సినిమాతో రాబోతున్నట్లు అర్థం అవుతోంది.

ఈ సినిమా జయ మోహన్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడుతోందని తెలుస్తోంది. వెట్రి మారన్ మునుపటి చిత్రాల మాదిరిగానే ఇది కూడా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా బలమైన కంటెంట్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరెంట్ మరియు ఫోన్ సిగ్నల్స్ కూడా లేని దట్టమైన సత్యమంగళం అటవీప్రాంతంలో జరుగుతోందని తెలుస్తోంది. దీని కోసం చిత్ర యూనిట్ స్థానిక గిరిజన ప్రజలతో కలిసి ఉంటున్నారని సమాచారం.

ఇకపోతే మాస్ట్రో ఇళయరాజా 'విడుదలై' చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆర్.రామర్ ఎడిటర్ గా.. జాకీ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఆర్.ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై ఎల్డ్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తమిళంతో పాటుగా ఇతర భారతీయ భాషలలో ఒకేసారి పాన్-ఇండియన్ మూవీగా విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని సమాచారం.