Begin typing your search above and press return to search.

అందుకే 'నారప్ప' నాకు సంథింగ్ స్పెషల్!

By:  Tupaki Desk   |   31 July 2021 3:32 AM GMT
అందుకే నారప్ప నాకు సంథింగ్ స్పెషల్!
X
వెంకటేశ్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా రూపొందింది. తమిళంలో ధనుశ్ చేసిన 'అసురన్'కి ఇది రీమేక్. సురేశ్ బాబు - కలైపులి థాను సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా విడుదలై అనూహ్యమైన రెస్పాన్స్ ను రాబడుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు నటీనటులు .. సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. వేదికపై వెంకటేశ్ తనదైన స్టైల్లో మాట్లాడారు.

'నారప్ప'కు భారీ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 'నారప్ప' చూసిన వాళ్లంతా చాలా బాగుందంటూ స్పందించిన తీరు నాకు బాగా నచ్చింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా 35 ఏళ్ల కెరియర్లో 'నారప్ప' స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. నటుడిగా నా ప్రయాణంలో ఎన్నో సినిమాలు .. ఎన్నో పాత్రలు చేశాను. కానీ ఈ కథ నా మనసుకు మరింత దగ్గరగా వచ్చింది. అందువల్లనే తమిళంలో 'అసురన్' చూడగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.

ఇంతమంచి కథను ఇచ్చినందుకు వెట్రి మారన్ కు .. ధనుశ్ కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్లు ఈ కథ ఇవ్వకపోతే 'నారప్ప' ఉండేది కాదు. నేను అనుకున్నట్టుగానే తెలుగు ఆడియన్స్ కి ఈ కథ కొత్తగా అనిపించింది. అందుకనే ఇంతలా అభిమానిస్తున్నారు .. ఆదరిస్తున్నారు. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి నేను ఒక్కడినే కాదు. నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈ విజయానికి కారకులే. ప్రియమణి .. కార్తీక్ రత్నం .. శీనప్ప .. రాజీవ్ కనకాల చాలా బాగా చేశారు. 60 రోజుల పాటు ఏకధాటిగా ఈ సినిమా షూటింగు చేయడం వలన, ఒకే కుటుంబ సభ్యులమనే ఫీలింగ్ వచ్చింది.

గ్యాప్ లేకుండా షూటింగు చేయడం వలన, అదే కాస్ట్యూమ్స్ తో ఉండటం వలన .. అదే మూడ్ లో చేయగలిగాను. అందుకే నా కెరియర్లో 'నారప్ప' నాకు స్పెషల్ గా అనిపిస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల .. కెమెరా మెన్ శ్యామ్ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వాళ్లకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు 'రా నరకరా' అనే పాట పల్లవి వినేవాడిని. ఆ పాట వినగానే నాకు మూడ్ వచ్చేసేది. అప్పుడు ఉత్సాహంతో షూటింగుకు రెడీ అయ్యేవాడిని.

ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం నాకు కొత్త అనుభవాన్నీ . అనుభూతిని ఇచ్చింది. బయట నుంచి వస్తున్న రెస్పాన్స్ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంటిల్లిపాది ఈ సినిమా గొప్పగా ఉందంటూ తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయనందుకు ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఆ తరువాత పరిస్థితిని అర్థం చేసుకుని ఆదరించారు. వాళ్లందరూ నిరాశ పడవలసిన పనిలేదు. తప్పకుండా 'ఎఫ్ 3' సినిమాతో సంక్రాంతికి థియేటర్లలో సందడి చేద్దాం" అంటూ చెప్పుకొచ్చారు.