ఓవర్ నైట్ సూపర్ స్టార్ కు గాయాలు.. 13 కుట్లు

Sat Apr 20 2019 15:23:45 GMT+0530 (IST)

Vicky Kaushal Breaks Cheekbone While Shooting , Gets 13 Stitches

ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాదులపై నిర్వహించిన సర్జికల్ స్టైక్స్ నేపథ్యంలో బాలీవుడ్ లో రూపొందిన చిత్రం 'యూరి : ది సర్జికల్ స్టైక్స్'. ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 45 కోట్ల బడ్జెట్ తో రూపొందిన యూరి చిత్రం 337 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో నటించిన విక్కీ కౌషల్ ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ అయ్యాడు. అతడి నటన మరియు బాడీ లాంగ్వేజ్ కు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం విక్కీ కౌషల్ బాలీవుడ్ లో వాంటెడ్ హీరో. అలాంటి హీరో తన తాజా చిత్రం షూటింగ్ లో గాయ పడ్డాడు. గదమ ఎముక విరగడంతో పాటు పై నుండి 13 కుట్లు పడ్డాయట.విక్కీ కౌశల్ ప్రస్తుతం భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఒక హర్రర్ సినిమాను చేస్తున్నాడు. మొన్నటి వరకు ముంబయిలోనే ఈ చిత్రం షూటింగ్ జరిగింది. అయితే ఇటీవలే గుజరాత్ కు యూనిట్ సభ్యులు షిప్ట్ అయ్యారు. దేశంలోనే అతి పెద్దదైన షిప్ బ్రేకింగ్ యార్డ్ లో చిత్రీకరణ జరుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక షిప్ పై విక్కీ నిల్చుని యాక్షన్ సీన్స్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

గాయపడ్డ విక్కీకి స్థానిక హాస్పిటల్ లో ప్రాధమిక చికిత్స అందించి ఆ వెంటనే ముంబయికి విమానంలో చేర్చడం జరిగింది. ముంబయిలోని ప్రముఖమైన హాస్పిటల్ లో విక్కీ గదమకు ఆపరేషన్ చేయడంతో పాటు 13 కుట్లు కూడా వేసినట్లుగా వైధ్యులు తెలియజేశారు. విక్కీ ప్రస్తుతం తాను చేస్తున్న హర్రర్ సినిమాను త్వరగా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో బ్రేక్ తీసుకోకుండా కష్టపడుతూ ఉన్నాడు. అంతా బాగా జరుగుతుందని భావిస్తున్న సమయంలో ఇలా జరిగిందని చిత్ర యూనిట్ సభ్యులు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. విక్కీ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు ప్రార్ధిస్తున్నారు. సర్జికల్ స్టైక్ 2 పేరుతో సినిమాను తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సమయంలో విక్కీ గాయ పడటంతో ఆ ఆఫర్ ను విక్కీ వదిలేసుకోవాల్సి వస్తుందా అనేది కూడా చూడాలి.