‘నాట్యం’ చిత్రానికి ఉప రాష్ట్రపతి మరియు బాలకృష్ణ ప్రశంసలు..!

Fri Oct 22 2021 22:00:01 GMT+0530 (IST)

Vice President and Balakrishna praise for 'Natyam' ..!

ప్రముఖ క్లాసికల్ డాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం  ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో  నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం మంచి ఆదరణను దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ మేరకు నాట్యం సినిమాపై ప్రశంసలఝల్లు కురిపించారు.ఈ మేరకు వెంకయ్య నాయుడు సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. ‘నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ ఇతర నటీనటులకు అభినందనలు’ అని తెలిపారు

ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘నాట్యం చిత్రాన్ని చూశాను. ఇది సినిమా కాదు కళాఖండం. సినిమా అనేది కేవలం వినోదం కోసం కాదు. మరుగున పడిపోతోన్న కళలు సంస్కృతులకు జీవం పోసి భావి తరాలకు అందించే ప్రయత్నం చేశారు. ఇంత మంచి చిత్రాన్ని అందించిన దర్శకనిర్మాతలకు అభినందనలు’ అన్నారు..