మళ్లీ మెగా హీరోతోనే 'వకీల్ సాబ్' డైరెక్టర్?

Tue May 18 2021 10:00:01 GMT+0530 (IST)

Venu Sri Ram Upcoming Movies Updates

పవన్ కల్యాణ్ .. దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన 'వకీల్ సాబ్' సంచనలన విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. పవన్ కి మంచి రీ ఎంట్రీ లభించినందుకు అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు ఒక దర్శకుడిగా వేణు శ్రీరామ్ ను అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వేణు శ్రీరామ్ తదుపరి ప్రాజెక్టు ఏది? ఆయన నెక్స్ట్ హీరో ఎవరు? అనే ఆసక్తి అందరిలోను తలెత్తుతోంది.ప్రస్తుతం వేణు శ్రీరామ్ దగ్గర ఒక మంచి కథ ఉందట. యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన రూపొందించిన ఈ కథను గురించి రెండు పెద్ద బ్యానర్లతో చర్చలు జరుపుతున్నాడట. ఎవరు ఓకే అంటే వాళ్లతో కలిసి ముందుకు వెళ్లనున్నాడు. ఎవరు ముందుకు వచ్చినా ఈ సినిమాను చేసేది మెగా హీరోతోనే అనే టాక్ వినిపిస్తోంది. ఆ మెగా హీరో ఎవరో కాదు .. సాయితేజ్. అవును .. ఆల్రెడీ ఆయనకు వేణు శ్రీరామ్ ఈ కథను వినిపించినట్టుగా చెప్పుకుంటున్నారు.

కొంతకాలంగా సాయితేజ్ ఓ మాదిరి హిట్లతో కెరియర్ నెట్టుకొస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'రిపబ్లిక్' నిర్మితమైంది. వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. వేణు శ్రీరామ్ తో సాయితేజ్ చేసే సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ ను గానీ .. ప్రియాంక అరుళ్ మోహన్ ను గాని కథానాయికగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' చేస్తున్న అనూ ఇమ్మాన్యుయేల్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది.