రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా.. మూడో సినిమాపై క్లారిటీ రావడం లేదే..!

Thu Apr 22 2021 17:00:02 GMT+0530 (IST)

Venky Kudumula Upcoming Movies Updates

'ఛలో' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల.. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత 'భీష్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వెంకీ.. బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టాలెంటెడ్ డైరెక్టర్ తదుపరి సినిమా ఎంటనేది ఆసక్తికరంగా మారింది. అయితే 'భీష్మ' సినిమా వచ్చి ఏడాది దాటినా ఈయన మూడో సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు వెంకీ కుడుముల కథలు వినిపించాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇద్దరికీ స్క్రిప్ట్స్ కూడా నచ్చాయని.. ఎవరో ఒకరు డేట్స్ ఇస్తే వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని టాక్ వచ్చింది. అయితే మరో మూడేళ్ల వరకు ఈ ఇద్దరు స్టార్ హీరోల డేట్లు దొరికేలా కనిపించడం లేదు. మహేష్ 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత రాజమౌళి - త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులతో సినిమాలు చేయాల్సి ఉంది.

అలానే చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' 'ఆచార్య' సినిమాల తర్వాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ క్రమంలో సుకుమార్ తో కూడా ఓ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇందంతా చూసుకుంటే రెండు వరుస హిట్స్ అందుకున్న వెంకీ కి.. ఇప్పట్లో మహేష్ - చరణ్ డేట్లు దొరక్కపోవచ్చు. అందుకే వీరి కోసం వెయిట్ చేయకుండా ఓ మీడియం రేంజ్ హీరోతోనే వెంకీ కుడుముల మూడో సినిమా చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది.