ఫైనెస్ట్ నేచురల్ యాక్టర్ నాని- వెంకీ

Mon Apr 15 2019 22:24:01 GMT+0530 (IST)

Venkatesh Praises Nani In Jersey pre Release Event

దశాబ్ధాల పాటు తెలుగు సినిమాకి మూల స్థంభంలా నిలిచిన ఓ నటుడు ఒక నవతరం హీరోకి కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే అంత ఆషామాషీ ఏమీ కాదు. ఎంతో మ్యాటర్ ఉంటేనే ఆ పొగడ్త సాధ్యం. జెర్సీ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ `నేచురల్ స్టార్`.. `వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్` అంటూ నానీకి కితాబిచ్చేయడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఇలాంటి కాంప్లిమెంట్లు అందుకోవడం నానీకి కొత్తేమీ కాదు. మెగాస్టార్ చిరంజీవి అంతటి వారే తాను అభిమానించే చక్కని నటుడు నాని అని అన్నారు. పక్కింటబ్బాయిలా కనిపిస్తూనే అద్భుతమైన వినోదం పంచే నానీ అంటే అందరికీ అభిమానమే.`జెర్సీ` ట్రైలర్ చూశాక ఎంతో ఎగ్జయిట్ అయ్యానని చెప్పిన వెంకీ ప్రీరిలీజ్ వేడుకలో.. ఆ సినిమాకి పని చేసిన టీమ్ ని ఆకాశానికెత్తేశారు. రేర్ గానే ఇలాంటి సినిమాలు వస్తాయి. ఇలాంటి వాటిలోనే నిరూపించుకునే  అవకాశం వస్తుంది. నటుడికి ఎమోషన్స్ పలికించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. ఇలాంటి పాత్రల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆర్టిస్టుగా చాలా ఎమోషన్ అయిపోతామని అన్నారు. `గురు` లాంటి క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించిన వెంకీ స్వతహాగానే జెర్సీ సినిమాకి కనెక్టయ్యారని ఆ మాటల్ని బట్టి అర్థమవుతోంది.

జెర్సీ ప్రీరిలీజ్ వేడుకలో వెంకీ మాట్లాడుతూ..``నానీ తెలుగు ఇండస్ట్రీలోనే ఫైనెస్ట్ యాక్టర్. పరిశ్రమలో ఏకైక నేచురల్ యాక్టర్ .. దీనిని ఫ్యాన్స్ గర్వంగా ఫీలవ్వాలి`` అని కితాబిచ్చారు. ``ట్రైలర్ చూడగానే ఇలాంటి సినిమాలు ఎమోషనల్ గా ఉంటాయి. స్ఫూర్తిని నింపుతాయి. ప్రతి ఒక్కరూ లైఫ్ లో స్ట్రగుల్ అవుతుంటారు. ఓటమి నుంచి నేర్చుకుంటారు. జీవితంలో ఓటమిని ఎదుర్కోండి. కానీ అంగీకరించవద్దు..  పెద్ద తెరపైనా నానీ అదే చేసి చూపించాడు. ఈ సినిమా అందరికీ టీచ్ చేస్తుంది`` అని అన్నారు. ఓడిపోవద్దు.. రైజ్ అవ్వండి. గోల్ వైపు ఎదగండి అని అభిమానులకు సూచించారు వెంకీ. ``టాలీవుడ్ లో ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఉందని గౌతమ్ ఒక వండర్ ఫుల్ సినిమాని తీశాడని ట్రైలర్ చూస్తే అర్థమైందని ప్రశంసించారు. స్వతహాగా క్రీడాభిమాని అయిన వెంకీ బ్లెస్సింగ్స్ ఇవ్వడంతో జెర్సీ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది.