తెలుగు ఇండస్ట్రీలో ఈ మాటలు వెంకీనే చెప్పగలరేమో?

Fri Dec 13 2019 10:18:00 GMT+0530 (IST)

పేరున్న నటుడైనప్పటికి డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా వ్యవహరించే హీరోల్లో ఒకరు వెంకటేశ్. హిపోక్రసీ లేకుండా మాట్లాడే వారిలో వెంకీ ముందుంటారని చెబుతారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం.. అనవసరమైన గొప్పలకు పోవటం అతనికి అలవాటు ఉండదంటారు. తాజాగా ఆయన నటించిన వెంకీ మామ ఈ రోజు విడుదలవుతోంది. మారుతున్న కాలానికి తగ్గట్లుగా తనను తాను మార్చుకునేందుకు ఏ మాత్రం వెనుకాడని ఆయన నోటి నుంచి తాజాగా వచ్చిన వ్యాఖ్య ఆసక్తికరంగానే కాదు.. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి దమ్ము ఆయనకే చెల్లు అన్న మాట వినిపిస్తోంది.

వెబ్ సిరీస్ లకు ఆదరణ అంతకంతకూ పెరుగుతున్న వేళ.. అగ్ర నటుడిగా తనకున్న ఇమేజ్ తో అలాంటి వాటిని ఎందుకు చేయాలన్న క్వశ్చన్ ను పక్కన పెట్టి.. ఎందుకు చేయకూడదన్న సూటిమాటే ఆయన నోటి నుంచి వస్తోంది. తాను వెబ్ సిరీస్ లోకి రావాలనుకుంటున్నట్లు వెంకటేశ్ చెప్పేశారు.

వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయమని ఎవరో ఒకరు వచ్చి అడగటం ఎందుకు?  నేనే దర్శకుల్ని అడుగుతానని చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఏదో ఒకటి రాయండి.. వెబ్ సిరీస్ కథలు తీసుకురండి చేద్దామని తానే చెప్పేస్తానంటూ తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పేశారు. తెలుగు ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ లో చేయటానికి ఇంత ఓపెన్ గా ఓకే చెప్పటం వెంకీకే సాధ్యమేమో?