మూడేళ్ల తరువాత థియేటర్స్ కి వస్తున్నా: వెంకీ

Sun May 22 2022 08:53:33 GMT+0530 (IST)

Venkatesh At F3 Prerelease Event

మొదటి నుంచి కూడా కామెడీ పరంగా వెంకటేశ్ కి మంచి మార్కులే పడుతూ వచ్చాయి. వెంకటేశ్ కామెడీ టైమింగ్ ను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. రాన్రాను కామెడీపై ఆయన మరింత పట్టుసాధిస్తూ వచ్చారు. 'ఎఫ్ 2' సినిమాలో  ఆయన చేసిన సందడి అంతా  ఇంతా కాదు. ఆ సినిమాలోని ఆయన డైలాగ్స్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'ఎఫ్ 3' సినిమా ఈ నెల  27వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్పకళావేదికలో నిర్వహించారు.ఈ సినిమాలో ఆయన రేచీకటితో ఇబ్బందిపడే పాత్రలో కనిపిస్తారు. అందుకు తగినట్టుగా ఆయన ఈవెంట్ లోకి ఎంటరవుతూ స్టేజ్ కి ఎటు వైపు వెళ్లాలో కనబడనట్టుగా తడుముకుంటూ నడుస్తూ సందడి చేశారు. కార్యక్రమం చివరిలో ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. " ఏంటమ్మా ఇది .. ఈ వెంకీమామకి ఎప్పుడూ లాస్ట్ కి మైక్ ఇస్తారు .. నాకేమో  మాటలు రావు. 30 ఏళ్ల నుంచి ఇదే చెబుతున్నాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో మూడేళ్ల క్రితం నా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి.

పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన 'దృశ్యం' .. 'నారప్ప' ఓటీటీకి వెళ్లాయి. అప్పును నా ఫ్యాన్స్ అందరూ కూడా డిజప్పాయింట్ అయ్యారు. అలాంటి వాళ్లంతా కూడా థియేటర్లలో ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. వాళ్లందరినీ థియేటర్స్ కి రప్పించే కంటెంట్ ఈ సినిమాలో ఉంది. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడల్లా మీరు ఆదరిస్తూనే ఉన్నారు .. అలాగే ఈ సినిమాను  ప్రోత్సహిస్తారనే నమ్మకం నాకు ఉంది. 'ఎఫ్ 2' మాదిరిగానే ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.

ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెబుతున్నాను. అనిల్ రావిపూడి ఈ సినిమాను చాలా గొప్పగా తీశాడు .. వరుణ్ చాలా బాగా చేశాడు. స్టేజ్ పై గేమ్స్ ప్లాన్ చేసిన తీరు .. కుసుమగా సుమ చేసిన సందడిని చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీరంతా కూడా ఎంతో దూరం నుంచి వచ్చి .. ఎంత సేపటి నుంచో వెయిట్ చేస్తూ వచ్చారు. మీ అందరి వల్ల ఈ ఈవెంట్ మాత్రం సూపర్ .. అదిరిపోయిందంతే. ఈ నెల 27వ తేదీన అందరూ థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమాను చూడండి" అంటూ ముగించారు.