ఈ జనరేషన్లో 'ఎఫ్ 3' లాంటి సినిమాను ఎవరూ తీయలేరు!

Sun May 22 2022 08:51:14 GMT+0530 (IST)

Varun Tej At F3 Pre Release Event

వెంకటేశ్ కి కామెడీ కొట్టిన పిండి .. అలాంటి ఆయన పక్కన  కామెడీ చేయడం అంత ఆషామాషీ విషయమేం కాదు. 'ఎఫ్ 2' సినిమా కోసం వెంకటేశ్ తో కలిసి నటించిన వరుణ్ ఆయన సీనియారిటీని .. ఆయన కామెడీ టైమింగ్ ను తట్టుకుని నిలబడ్డాడు. వరుణ్ కామెడీ కూడా బాగా చేయగలడని ఆ సినిమా నిరూపించింది. ఆ సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3' వస్తోంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో దిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్  లో వరుణ్ తేజ్ మాట్లాడాడు.ముందుగా ఈ ఈవెంట్ లో ఇంత సందడి చేసిన సుమగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. కుసుమ గారిలా తాను బాగా చేశారు. ఈ సినిమా షూటింగు నడుస్తుండగానే రెండు సమ్మర్లు అయిపోయాయి. పూర్తి స్థాయిలో ఇలాంటి ఒక కామెడీ  సినిమా వచ్చి  చాలా కాలమే అయింది. మీరంతా మీ ఫ్యామిలీస్ తో కలిసి థియేటర్స్ కి వెళ్లి చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నాకు సునీల్ అంటే ఇష్టం .. ఆయన  కామెడీ అంటే ఇష్టం. పాత సునీల్ ను మీరు 'ఎఫ్ 3'లో చూస్తారు. ఆయన .. నేనూ మామా అల్లుళ్లుగా చేశాము ఈ సినిమాలో.

ఈ సినిమా కోసం ఆర్టిస్టులు .. టెక్నీషియన్లు మనసు పెట్టి పనిచేశారు. దిల్ రాజు బ్యానర్లో  నాకు ఇది మూడో సినిమా. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాననే అనుకుంటాను. అనిల్ రావిపూడి వంటి పాజిటివ్ పర్సన్ ను నేను ఇంతవరకూ చూడలేదు. తన చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఎప్పుడు నవ్వేలా చేస్తుంటాడు. ఈ జనరేషన్ లో కామెడీని ఆయనకంటే ఎవరూ అ ద్భుతంగా చేయలేరని నాకు అనిపిస్తోంది. 'ఎఫ్ 3' సినిమాతో మళ్లీ ఆ విషయాన్ని ఆయన ప్రూవ్ చేస్తారు. ఈ సినిమా ఆయనకి మరింత మంచి పేరు తీసుకుని వస్తుందని భావిస్తున్నాను.

వెంకటేశ్ గారి విషయానికి వస్తే అందరికంటే ఎక్కువ మల్టీ స్టారర్ లు చేశారు. ఆయనతో రెండోసారి కూడా కలిసి నటించే అవకాశం నా ఒక్కడికే దక్కింది. ఆయనతో కలిసి గడిపిన ప్రతి రోజును .. ప్రతి క్షణాన్ని నేను మరిచిపోలేను. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలను  నేర్చుకున్నాను. 'ఎఫ్ 2' కంటే కూడా 'ఎఫ్ 3' జర్నీ చాలా సంతోషంగా .. సరదాగా సాగింది. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. మళ్లీ సక్సెస్ మీట్లో కలుసుకుందాం" అంటూ చెప్పుకొచ్చాడు.