'ఎఫ్ 3'లో నాన్ స్టాప్ కామెడీ తట్టుకోవడం నా వల్లనే కావడం లేదు: వరుణ్ తేజ్!

Mon Oct 18 2021 17:00:01 GMT+0530 (IST)

Varun Tej About F3 Movie

అనిల్ రావిపూడి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'ఎఫ్ 2' సినిమాను ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. వరుణ్ తేజ్ తెలంగాణ యాస .. వెంకీ ఆసనం తలచుకుని ఇంకా నవ్వుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ  టీవీలో ఈ సినిమా వస్తుంటే ఛానల్ మార్చేవారు దాదాపుగా ఉండరు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి అనిల్ రావిపూడి కొంతకాలం క్రితమే  రంగంలోకి దిగాడు. 'ఎఫ్ 3' టైటిల్ తో ఈ సినిమా ఉంటుందని ప్రకటించాడు. అయితే కరోనా రావడం వలన ఈ సినిమా షూటింగు కూడా చాలా ఆలస్యంగానే మొదలైంది.ఇక ఒక వైపున వెంకటేశ్ 'దృశ్యం 2' .. 'నారప్ప' సినిమాలు పూర్తి చేసుకుని రావడం వలన మరోవైపున వరుణ్ తేజ్ 'గని' షూటింగును పూర్తి చేసి రావడం కూడా ఈ సినిమా ఆలస్యానికి కారణాలయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చకచకా జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వస్తున్నారు. తాజాగా లాంగ్ షెడ్యూల్ షూటింగును పూర్తి చేశారు. ఆ విషయాన్ని వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా చెబుతూ లొకేషన్లో వెంకీతో దిగిన ఒక ఫోటోను షేర్ చేశాడు.

లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది .. వెంకటేశ్ .. వరుణ్ తేజ్  ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో సరదాగా ఏదో మాట్లాడుకుంటూ ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. "ఈ షెడ్యూల్ అంతా కూడా పిచ్చ కామెడీ సీన్స్ తో సాగిపోయింది. ఆ నాన్ స్టాప్ కామెడీని తట్టుకోవడం నా వల్లనే కాలేదు. మరో షెడ్యూల్ షూటింగు మొదలయ్యేవరకూ నేను ఆగలేను" అంటూ  వరుణ్ తేజ్  రాసుకొచ్చాడు. అంటే మరో షెడ్యూల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనే ఆత్రుతలో ఉన్నాడన్నమాట. మరి అనిల్ రావిపూడి తదుపరి షెడ్యూల్ ను ఎప్పుడు ప్లాన్ చేస్తాడో .. ఎక్కడ ప్లాన్ చేస్తాడో!

వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ అందాల సందడి చేయనున్నారు. ఇక 'ఎఫ్ 2'లో మాదిరిగానే రాజేంద్రప్రసాద్ అల్లరి కూడా కొనసాగనుందని తెలుస్తోంది. కొత్తగా ఈ సినిమాలో సునీల్ .. ఖడ్గం సంగీత .. అంజలి కనిపించనున్నారు. వీళ్ల పాత్రలు ఏమిటి? తెరపై అవి చేసే సందడి ఏమిటి? అనే విషయమే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచన చేశారు. కానీ కరోనా కారణంగా ఆ ప్లానింగ్ దెబ్బతింది. మరి ఇప్పుడు సంక్రాంతికి రావడానికే ప్రయత్నం చేస్తారో .. త్వరలోనే మరో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారో చూడాలి.