Begin typing your search above and press return to search.

మెగా హీరో.. ఓ బేబీ డైరెక్టర్ సినిమా ఫిక్స్

By:  Tupaki Desk   |   23 Jan 2020 6:31 AM GMT
మెగా హీరో.. ఓ బేబీ డైరెక్టర్ సినిమా ఫిక్స్
X
మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం కాబోతున్న కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ ప్రస్తుతం తన డెబ్యూ ఫిలిం 'ఉప్పెన' లో నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల కాకముందే వైష్ణవ్ కు మరో సినిమా ఓకే అయిందని సమాచారం.

ఈ సినిమాను అశ్విని దత్ కుమార్తెలు స్వప్న దత్.. ప్రియాంక దత్ నిర్మిస్తారని.. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తారని సమాచారం. నందిని రెడ్డి ఈమధ్యే 'ఓ బేబీ' చిత్రంతో మంచి విజయం నమోదు చేశారు. ఈ సినిమా తర్వాత నెట్ ఫ్లిక్స్ వారి 'లస్ట్ స్టోరీస్' కు దర్శకత్వం వహించాల్సి ఉంది. ఇది పూర్తి కాగానే మెగా హీరో సినిమా పై దృష్టి సారిస్తారట. సునిశిత హాస్యంతో కూడిన ప్రేమ కథా చిత్రాలు తెరకెక్కించడంలో నందిని రెడ్డి కి మంచి పేరు ఉంది. మరి ఈ మెగా హీరో కోసం ఆవిడ ఎలాంటి కథ రెడీ చేస్తారో వేచి చూడాలి.

వైష్ణవ్ తేజ్ డెబ్యూ ఫిలిం ఫలితం తో సంబంధం లేకుండా ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. మరి 'ఉప్పెన' తో వైష్ణవ్ ఎలాంటి ఫలితం అందుకుంటాడో వేచి చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న 'ఉప్పెన' కు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు.