Begin typing your search above and press return to search.

కాపీ కాదు.. ప్రేరణా కాదు: వీఐ ఆనంద్

By:  Tupaki Desk   |   23 Jan 2020 1:18 PM GMT
కాపీ కాదు.. ప్రేరణా కాదు: వీఐ ఆనంద్
X
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన 'డిస్కోరాజా' రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆసక్తికరమైన టీజర్లు.. లిరికల్ సాంగ్స్ తో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. రవితేజ ఈమధ్య నటించిన సినిమాలు సరిగా మెప్పించలేదు కానీ ఆ ప్రభావం ఈ సినిమాపై ఏమాత్రం కనిపించడం లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగడం అందుకు సాక్ష్యం.

సైఫై యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకుడు. 'డిస్కోరాజా' ప్రమోషన్లలో భాగంగా వీఐ ఆనంద్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఏ సినిమాకు అయినా కథే ముఖ్యమని.. అందుకే కథను బట్టే హీరోను ఎంచుకుంటానని ఆనంద్ తెలిపారు. ఈ సినిమాకు రవితేజ కరెక్ట్ గా సరిపోతారని అన్నారు. మంచి కాన్సెప్ట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉండేలా ఈ సినిమాను రూపొందించామని తెలిపారు.

సైఫై జోనర్ అనగానే ఇదేదో హాలీవుడ్ సినిమాకు కాపీ అని చాలామందికి అనుమానం వస్తుంది. అయితే ఆనంద్ ఈ విషయంపై మాట్లాడుతూ ఏ హాలీవుడ్ సినిమాకు 'డిస్కోరాజా' కాపీ కాదని.. ప్రేరణ కూడా తీసుకోలేదని అన్నారు. న్యూస్ పేపర్ లో బయో కెమికల్ లాబ్ కు సంబంధించిన ఒక వార్తను చదివిన తర్వాత ఈ సినిమా కథకు ఐడియా వచ్చిందని చెప్పుకొచ్చారు. ఒక పరిశోధనశాలలో జరిగే రీసెర్చ్ విజయవంతమైతే ఎమౌతుంది అనే ఆలోచన ఈ సినిమా కథగా మలుచుకున్నానని తెలిపారు. మరి ఈ డిస్కోరాజా ప్రేక్షకులను ఎంతమాత్రం మెప్పిస్తాడో రేపే తెలుస్తుంది.