Begin typing your search above and press return to search.

పోలీస్ గ‌డ‌ప‌పై ఉయ్యాలవాడ వార‌సుల పోరాటం

By:  Tupaki Desk   |   22 Sep 2019 4:54 AM GMT
పోలీస్ గ‌డ‌ప‌పై ఉయ్యాలవాడ వార‌సుల పోరాటం
X
టాలీవుడ్ చుట్టు మ‌ళ్లీ వివాదాలు అలుముకుంటున్నాయి. ఇటీవ‌ల వ‌రుణ్ తేజ్ న‌టించిన‌ `వాల్మీకి` టైటిల్ వివాదాస్ప‌దంగా మారి చివ‌రి నిమిషంలో ప‌రిష్కారం వెత‌కాల్సొచ్చింది. దాంతో `గ‌ద్ద‌లకొండ గ‌ణేష్‌`గా మార్చి రిలీజ్ చేశారు. అంత‌కుముందు నానీస్ గ్యాంగ్ లీడ‌ర్ స‌న్నివేశం ఇదే. తాజాగా `సైరా` టీమ్ స‌మ‌స్య మ‌రో ర‌కంగా ఉంది. బ్రిటీష్ సామ్రాజ్యంపై దండెత్తిన తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రామ్‌ చ‌ర‌ణ్ నిర్మించారు. అక్టోబ‌ర్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న వేళ ఉయ్యాల‌వాడ వార‌సులు కొంత మంది `సైరా` రిలీజ్ ని అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఆందోళ‌న‌లు విర‌మించాలంటే త‌మ‌కు ద‌క్కాల్సిన‌ది ఇవ్వాల‌ని గ‌తంలో చిరు సినిమా కార్యాలయం ముందు ఆందోళ‌న‌కు దిగారు. తాజాగా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో త‌మ ఆందోళ‌న‌ను మ‌రింత ఉధృతం చేశారు. తాజాగా ఈ పంచాయితీని పోలీస్ స్టేష‌న్ దాకా తీసుకెళ్లారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌ లో కేసు న‌మోదు చేయించారు. 23 మంది ఉయ్యాల‌వాడ బంధువులు రామ్ చ‌ర‌ణ్ త‌మ‌కు రైట్స్ కింద‌ డ‌బ్బులు చెల్లిస్తాన‌ని మాటిచ్చి ఇప్పుడు మాట త‌ప్పాడ‌ని కేసు న‌మోదు చేయించారు. దీంతో ఈ వివాదంపై చ‌ర్చ సాగుతోంది.

చ‌ట్ట‌ప‌రంగా త‌మ‌తో అగ్రిమెంట్లు కూడా చేసుకుని ఒక్కొక్క‌రికి 2 కోట్లు ఇస్తామ‌ని చెప్పిన నిర్మాత‌ రామ్ చ‌రణ్ ఇప్పుడు త‌ప్పించుకు తిరుగుతున్నాడ‌ని వారు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క‌రికి 2 కోట్లు చొప్పున‌ 23 మందికి క‌లిపి 46 కోట్లు ఇవ్వాల‌న్న‌ది వారి డిమాండ్‌. అయితే ఈ డిమాండ్ కి చిత్ర యూనిట్ తో పాటు రామ్ చ‌ర‌ణ్ దిగి రాలేద‌ని.. త‌మ వాద‌న‌ని అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఎవ‌రికి ఎలాంటి డ‌బ్బులు ఇవ్వ‌మ‌ని.. ఎవ‌రికి చెప్పుకుంటారో చెప్పుకోండ‌ని చిత్ర యూనిట్ బెదిరిస్తోంద‌ని పోలీస్ స్టేష‌న్ లో ఉయ్యాలవాడ‌ వార‌సులు ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవ‌లే ట్రైల‌ర్ రిలీజ్ వేడుక‌లో ఈ స‌మ‌స్య గురించి ప్ర‌శ్నిస్తే.. ఉయ్యాలవాడ ఫ్యామిలీలో న‌లుగురి వ‌ర‌కే సాయం చేసి ఆయ‌న గౌర‌వాన్ని త‌గ్గించ‌ను.. చేయాల్సి వ‌స్తే ఆ ఊరికి ఏదైన సాయం చేస్తాన‌ని రామ్ చ‌ర‌ణ్ అన్నారు. మొత్తానికి ఈ స‌మ‌స్య రిలీజ్ ముంగిట ఎలా ప‌రిష్కారం కానుంది అన్న‌ది చూడాలి.