ఊర్వశివో రాక్షసివో.. రీమేక్ సినిమా?

Fri Sep 30 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Urvashivo Rakshasivo.. Remake movie?

అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ నుంచి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా 'ఊర్వశివో రాక్షసివో'. ఇందులో అతడి సరసన అను ఇమ్మాన్యుయెల్ నటించింది. ఇంతకుముందు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా 'విజేత' అనే సినిమా తీసిన రాకేశ్ శశి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా మెగా కాంపౌండ్లో ఇంకో అవకాశం అందుకున్నాడు.ముందు 'ప్రేమ కాదంట' అనే టైటిల్‌తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'ఊర్వశివో రాక్షసివో' అంటూ కొత్త టైటిల్‌తో పలకరించింది చిత్ర బృందం. నవంబరు 4న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్.. కుర్రాళ్లను బాగానే ఆకట్టుకుంది. సినిమా అంతా కూడా ఘాటు ఘాటు సన్నివేశాలతో నడుస్తుందని.. యూత్‌కు కావాల్సిన రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్‌కు ఇందులో ఢోకా లేదని టీజర్ చూస్తే అర్థమైంది.

ఐతే ఈ సినిమా ఓ తమిళ చిత్రానికి రీమేక్ అనే సందేహాలు కలుగుతున్నాయి. తమిళంలో హరీష్ కళ్యాణ్ హీరోగా నాలుగేళ్ల కిందట 'ప్యార్ ప్రేమ కాదల్' అనే సినిమా ఒకటి వచ్చింది. అది అడల్ట్ రేటెడ్ మూవీ. అమాయకమైన అబ్బాయి.. తన నుంచి సెక్స్ సుఖం మాత్రమే కోరుకుని ప్రేమ పెళ్లి లాంటివి తన ఒంటికి అస్సలు పడవు అనే మోడర్న్ అమ్మాయి.. వీరి మధ్య నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కింది.

ఇందులోని హాట్ అండ్ బోల్డ్ సీన్లు డైలాగులు యూట్యూబ్‌లో ఇప్పటికీ యూత్‌కు పిచ్చెక్కిస్తుంటాయి. ఇంతకుముందు మారుతి దర్శకత్వంలో ఆయన మార్గనిర్దేశంలో ఇలాంటి బోల్డ్ సినిమాలు తరచుగా వస్తుండేవి. 'ఊర్వశివో రాక్షసివో' టీజర్ చూస్తే 'ప్యార్ ప్రేమ కాదల్'కు చాలా దగ్గరగా అనిపిస్తోంది.

రెండు చిత్రాల్లోనూ హీరో పేరు కూడా శ్రీనే కావడం.. హీరోయిన్ చాలా అడ్వాన్స్డ్‌గా కనిపించడం గమనార్హం. మరి ఈ పోలిక యాదృచ్ఛికమా లేక ఆ సినిమాను నిజంగానే రీమేక్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.