Begin typing your search above and press return to search.

ఓడినా వీడనంటున్న రంగీల

By:  Tupaki Desk   |   24 May 2019 3:27 PM GMT
ఓడినా వీడనంటున్న రంగీల
X
బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా దశాబ్ద కాలం పాటు కొనసాగిన ముద్దుగుమ్మ ఊర్మిళా మతోండ్కర్‌. సినిమాల్లో గత కొంత కాలంగా అవకాశాలు తగ్గడంతో ప్రేక్షకులకు దూరంగా ఉంటున్న ఊర్మిళా ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. కాంగ్రెస్‌ తరపున తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసింది. ముంబయి నార్త్‌ లోక్‌ సభ స్థానం నుండి పోటీ చేసిన ఈ అమ్మడికి అక్కడి ఓటర్లు షాక్‌ ఇచ్చారు. తన ఇమేజ్‌ తో ఓట్లు దక్కించుకుంటానంటూ భావించిన ఊర్మిళా బీజేపీ ప్రభంజనం ముందు నిలవలేక పోయింది.

ముంబయి నార్త్‌ నుండి ఊర్మిళాపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి గోపాల్‌ శెట్టి చేతిలో 4,52,226 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఓటమి తర్వాత ఊర్మిళా స్పందించింది. ఈ సందర్బంగా ఆమె... ఈ ఓటమి తనకు ఒక గుణపాఠం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ ఓటమితో నేను రాజకీయాలకు దూరం కాను. రాజకీయాల్లోనే కొనసాగే ఉద్దేశ్యంతో వచ్చాను. అధికారం లేకున్నా కూడా రాజకీయాల్లోకి కొనసాగుతాను. సమస్యలపై పోరాడేందుకు తాను సిద్దంగా ఉన్నాను. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నేను నా ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చానని భావిస్తున్నాను. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసింది.

ఇదే సమయంలో ఈవీఎంలపై అనుమానంను వ్యక్తం చేసింది. ఈవీఎంల ట్యాంపరింగ్‌ వల్ల బీజేపీ ఈస్థాయిలో గెలిచిందనే అనుమానాలను ఆమె వ్యక్తం చేసింది. గతంలోనే తాను ఈవీఎంలలో లోపాలున్న విషయాన్ని తెలియజేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశాను. కాని ఈసీ మాత్రం నా ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని ఊర్మిళా ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాలకు దూరం అయిన ఊర్మిళా పుల్‌ టైం రాజకీయాలు చేస్తుందో లేదో చూడాలి.