Begin typing your search above and press return to search.

సెట్ లో దుస్తుల్ని చించేశారు.. నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   23 Oct 2021 4:34 AM GMT
సెట్ లో దుస్తుల్ని చించేశారు.. నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు
X
సంచలన ఆరోపణ చేశారు బిగ్ బాస్ ఓటీటీ ఫేం కమ్ టీవీ నటి ఉర్ఫి జావేద్. ‘బాదే భయ్యా కి దుల్యానియా’ సీరియల్‌తో పేరు తెచ్చుకున్న ఆమె మేరీ దుర్గా అనే సీరియల్ తో మంచి నటిగా గుర్తింపు పొందారు. ఇటీవల ఆమె ఓటీటీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి.. బయటకు వచ్చిన ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె సంచలన అంశాల్ని వెల్లడించారు. తన గురించి.. తన కుటుంబ నేపథ్యంతో పాటు.. సినిమాల్లోకి రావటానికి తానెంతగా కష్టపడిన విషయాల్ని వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లటం తన కుటుంబంలోని వారికి ఇష్టం లేకపోవటంతో.. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పారు.

నెలకు రూ.3వేల జీతంతో చిన్న ఉద్యోగంలో చేరి.. సినిమా అవకాశాల కోసం ఎంతోమందిని కలిసినట్లు చెప్పారు. ఆర్థికంగాచాలా ఇబ్బందులు పడేదానినని.. చాలాసార్లు ఖాళీ కడుపుతో పడుకునేదాన్ని అని చెప్పారు. ఆఫర్ ఇచ్చినట్లే ఇచ్చి తర్వాత నో చెప్పేవారన్నారు. అలాంటి వేళ ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం తనకు వచ్చిందని.. అందుకు ఓకే చెప్పి కాంటాక్టు పేపర్ల మీద సంతకం చేశానని చెప్పారు.

షూటింగ్ లో భాగంగా తొలిరోజున సెట్ లోకి వెళితే.. స్క్రిప్టులో లేని సీన్ చేయాలని చెప్పారని.. తాను నో చెప్పినట్లు చెప్పారు. ఆ వెబ్ సీరిస్ నిర్మాత ఒక మహిళ. అయినా ఆమె అందరి ముందు నాతో అసభ్యంగా ప్రవర్తించిందన్నారు. ‘షూట్ స్టార్ట్ కాగానే దుస్తులు తొలగించాలని చెప్పారు. దీంతో ఎందుకని అడిగా. అది ఆమెకు నచ్చలేదు. ఆ సీన్ చేయనని చెప్పా. ఆమె వినకుండా బలవంతంగా నా ఒంటి మీద ఉన్న దుస్తుల్ని చింపేసింది. ఎంత వేడుకున్నా వదల్లేదు. పైగా కాంటాక్టు పేపర్లు చూపించి కోర్టుకు వెళతానని బెదిరించింది’ అంటూ ఉర్ఫి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గానూ.. అంతకు మించిన సంచలనంగా మారింది. కొత్త చర్చకు ఉర్ఫి తెర తీశారని చెప్పాలి.