Begin typing your search above and press return to search.

ఉప్పెన‌లా దూసుకొస్తున్న మేన‌ల్లుడు!

By:  Tupaki Desk   |   23 Jan 2020 1:20 PM GMT
ఉప్పెన‌లా దూసుకొస్తున్న మేన‌ల్లుడు!
X
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టికే డ‌జ‌ను మంది స్టార్లు రంగ ప్ర‌వేశం చేసిన‌ సంగ‌తి తెలిసిందే. ఇక మెగా మేన‌ల్లుడు సాయి తేజ్ ఇప్ప‌టికే ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. కొన్ని వ‌రుస‌ అప‌జ‌యాల‌తో ఉక్కిరిబిక్కిరి అయ్యాకా.. నెమ్మ‌దిగా కంబ్యాక్ అయ్యాడు. ఇప్పుడు మెగా మేన‌ల్లుడు 2 బ‌రిలోకొస్తున్నాడు. సాయి తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ కోటి ఆశ‌ల‌తో త‌న‌ని తాను నిరూపించుకునేందుకు దూసుకొస్తున్నాడు. ఉప్పెన అనేది టైటిల్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఇప్ప‌టికే ప్రీలుక్ రిలీజైంది. వైష్ణ‌వ్ తేజ్ అన్న‌ను మించిన మాస్ హీరో అవుతాడు అంటూ మెగా ఫ్యాన్స్ ఉత్సాహ‌ప‌డ్డారు. ఫిష‌ర్ మేన్ గెట‌ప్ తో వైష్ణవ్ ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ గా క‌నిపించాడు. తాజాగా గురువారం సాయంత్రం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్ రిలీజైంది. తాజా పోస్ట‌ర్ లోనూ వైష్ణవ్‌ మాస్‌ లుక్ ఆక‌ట్టుకుంది. స‌ముద్ర‌పు అల‌లు తీరం వైపు అంతెత్తున ఎగ‌సిప‌డుతూ ఉప్పెనలా మారి ముంచేయ‌డానికి దూసుకొస్తుందో ఆ అలకు ఎదురెళ్లి ఎంతో ఎమోష‌న‌ల్ గా క‌నిపిస్తున్నాడు వైష్ణ‌వ్. త‌న జీవితంలో అంత ఉద్విగ్న‌మైన క్ష‌ణం ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాల్సి ఉంది. ఇక పూల చొక్కాయ్.. ట్రాక్ ఫ్యాంట్ లో మాస్ లుక్ హైలైట్ గా నిలిచింది.

సుకుమార్‌ రైటింగ్స్ - మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దేవీశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నామ‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఎట్ట‌కేల‌కు కాస్త ఆల‌స్య‌మైనా.. మండే ఎండ‌ల్లో ఉప్పెన దూసుకొస్తోంది. ఇది బాక్సాఫీస్ వ‌ద్ద మెగా ఉప్పెన‌గా మారుతుందా? మేన‌ల్లుడు 2 ఆరంగేట్రం ఎలా ఉండ‌బోతోంది? అన్న‌ది వేచి చూడాల్సి ఉంది.