'ది ఘోస్ట్' ను దెబ్బేసిన ఉప్పల్ మ్యాచ్..?

Wed Sep 28 2022 08:00:02 GMT+0530 (India Standard Time)

Uppal Match that damaged 'The Ghost'..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ "ది ఘోస్ట్". ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.'ది ఘోస్ట్' సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే అంత భారీ ఎత్తున చేసిన ఫంక్షన్ గురించి ఇప్పుడు పెద్దగా మాట్లాడుకోవడం లేదు.

కర్నూలులో 'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి అక్కినేని నాగార్జున తో పాటుగా తనయులు యువ సామ్రాట్ నాగచైతన్య మరియు యూత్ కింగ్ అఖిల్ లు గెస్టులుగా హాజరయ్యారు. అక్కినేని త్రయం చాలా రోజుల తర్వాత ఒకే సినిమా వేదికను పంచుకోవడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

అయితే అదే రోజున హైదరాబాద్ లో ఇండియా వెర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఉండటంతో 'ది ఘోస్ట్' ఈవెంట్ కు చాలామంది ప్రేక్షకులను దూరం చేసింది. టీవీల ముందు కూర్చున్న జనాలు కీలకమైన మ్యాచ్ చూడటానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ ప్రీ రిలీజ్ ని చూడలేదని అంటున్నారు. అందుకే ఈ ఫంక్షన్ గురించి పెద్దగా చర్చించడం లేదని.. రాయలసీమలో చేసిన 'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాకు ప్లస్ అవ్వలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

'ది ఘోస్ట్' సినిమాపై నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నారు. తన కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచిన 'శివ' సినిమా రిలీజైన రోజే ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు.

వారసులు చైతన్య - అఖిల్ సైతం తాము తమ నాన్న ని ఎలా చూడాలని అనుకున్నామో అలాంటి చిత్రమిదని స్టేట్మెంట్స్ ఇచ్చారు. శివ - రక్షణ - అంతం సినిమాల రేంజ్ లో నాగార్జున పాత్రలో ఇంటెన్సిటీ ఉంటుందని.. ఇది పవర్ ఫుల్ యాక్షన్ - ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెబుతున్నారు. మరి ఈ సినిమా కింగ్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

కాగా 'ది ఘోస్ట్' సినిమాలో నాగ్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా.. గుల్ పనాగ్ - అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. మార్క్ కె రాబిన్ - భరత్ - సౌరబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ అందించారు. దినేష్ సుబ్బరాయన్ - కేచా మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. 'ది ఘోస్ట్' చిత్రాన్ని అక్టోబర్ 5న తెలుగుతో పాటుగా హిందీ - తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్ లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ రిలీజ్ చేస్తుందని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.