ఉపేంద్ర పాన్ ఇండియా 'కబ్జా' రెడీ.. సాధ్యమేనా?

Tue Jan 24 2023 12:59:11 GMT+0530 (India Standard Time)

Upendra Pan India Film Kabzaa Movie

విలక్షణ నటుడు కన్నడ మెగా సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా వస్తున్న మూవీ కబ్జా. కన్నడతో పాటు దక్షిణాది భాషల్లో చాలా మందికి ఉపేంద్ర సుపరిచితమే. ఇప్పటికీ ఎంతో మంది హీరోలు చేయడానికి భయపడే చాలా పాత్రలను ఉపేంద్ర ఆనాడే చేసేశాడు.అలా విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఉపేంద్ర హీరోగా కనిపించి చాలా రోజులే అయింది. అతిథి పాత్రల్లో పలు సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ ఆయన నుండి ఫుల్ లెంత్ పాత్ర చేయక ఆయన అభిమానులు నిరాశతో ఉన్నారు. ఇప్పుడు పీరియాడిక్ మూవీ కబ్జాతో హీరోగా కనిపించనున్నాడు ఉపేంద్ర.

ఎంటీబీ నాగరాజ్ సమర్పణలో శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తున్న కబ్జా మూవీ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా ఆరోజే ఉపేంద్ర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే కిచ్చా సుదీప్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

కన్నడ హిందీ తమిళ్ తెలుగు మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన కబ్జా టీజర్ ను ప్రేక్షకులను విశేషంగా అలరించింది. కబ్జా పీరియాడిక్ మూవీగా తెరకెక్కింది. 1947 నుండి 1984 టైమ్ లో సినిమా రన్ అవుతుంది. స్వాతంత్రంయ కోసం పోరాడిన యోధుడి కొడుకు మాఫియా డాన్ గా ఎలా మారాడు ఎందుకు ఆ దారిలోకి వెళ్లారు ఆ తర్వాత అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేదే సినిమా కథ.

ఉపేంద్ర సినిమాలు అంటేనే విలక్షణంగా ఉంటాయి. కథ కథనం కొత్తగా ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఉపేంద్ర మూవీ వస్తుండటంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మరి ఉపేంద్ర కబ్జా ఎలా ఉండనుంది ఏ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయనుందో తెలియాలంటే మార్చి 17 వరకు ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.