Begin typing your search above and press return to search.

ఘోస్ట్ ఆప్షన్ నెం.3 నా..?

By:  Tupaki Desk   |   4 Oct 2022 6:35 AM GMT
ఘోస్ట్ ఆప్షన్ నెం.3 నా..?
X
ఈసారి దసరా బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు పోటీ పడబోతున్నాయి. 'గాడ్ ఫాదర్' మరియు 'ది ఘోస్ట్' చిత్రాలతో పాటుగా 'స్వాతిముత్యం' వంటి చిన్న సినిమా కూడా విడుదల కాబోతోంది. మూడు సినిమాలు కూడా ఒకే రోజున (అక్టోబర్ 5) థియేటర్లలోకి వస్తుండటంతో.. రేసులో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరోవైపు కింగ్ అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' చిత్రంపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ - రిలీజ్ ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ వారి 'స్వాతిముత్యం' సినిమా కూడా ప్రచార చిత్రాలతో సందడి క్రియేట్ చేసింది.

ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోడానికి మూడు సినిమాలూ తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని ఏరియాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ మరియు బజ్ చూస్తుంటే.. దసరా సినిమాల్లో 'గాడ్ ఫాదర్' మొదటి స్థానంలో ఉందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోని కాకుండా ఓవర్ సీస్ లోనూ చిరు చిత్రానికి బుకింగ్స్ బాగున్నాయి.

అయితే 'ఘోస్ట్' సినిమాకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేవు. బుక్ మై షో యాప్ లో ఎక్కువ శాతం షోలు గ్రీన్ మోడ్ లో కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది. యూఏస్ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. 80 లొకేషన్స్ లో 118 షోల నుంచి $13,840 (1055 టికెట్లు) మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

నాగ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన 'ఆఫీసర్' మూవీ ప్రీమియర్స్ ద్వారా $27K వసూలు చేసింది. ఇప్పుడు 'ది ఘోస్ట్' సేల్స్ పుంజుకోకపోతే ఆ నంబర్ ని క్రాస్ చేయడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమోషన్‌లను టీమ్ సరిగ్గా ప్లాన్ చేయకపోవడం ప్రీమియర్ నంబర్‌లపై భారీ ప్రభావాన్ని చూపుతోందని అర్థమవుతోంది.

బెల్లంకొండ గణేష్ డెబ్యూ 'స్వాతిముత్యం' చిత్రానికి ఉన్న బజ్ కూడా కింగ్ నాగ్ నటించిన 'ఘోస్ట్' సినిమాకు లేకపోవడం బాధాకరమైన విషయం. ఇటీవల కాలంలో నాగార్జున చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించకపోవడంతో ఘోస్ట్ పై అంతగా ఆసక్తి చూపడం లేదని బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ఘోస్ట్' చిత్రానికి మౌత్ టాక్ కీలకంగా మారే అవకాశం ఉంది. మరి నాగార్జున ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.