ఆగస్టులో చరణ్ శుభారంభం ఖాయమా?

Tue Jul 27 2021 07:00:01 GMT+0530 (IST)

Update On Charan Shankar Movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. చివరి షెడ్యూల్ కు అంతా సిద్దం అయ్యింది. వచ్చే నెలలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టడం ద్వారా చరణ్ మరియు ఎన్టీఆర్ లు స్వేచ్చా పక్షులు అవ్వబోతున్నారు. జక్కన్న సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు.. ఇక చరణ్ ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో సినిమా ను కన్ఫర్మ్ చేశాడు. ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు కాస్త సమయం పడుతుందని అంతా భావించారు. కాని తాజాగా నిర్మాత దిల్ రాజు ఆఫీస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందట.ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను చక్క బెడుతున్న శంకర్ మరో వైపు సినిమాకు సంబంధించిన లొకేషన్స్ కోసం పర్యటిస్తున్నారట. శంకర్ సినిమాలోని సన్నివేశాలు ప్రతి ఒక్కటి కూడా అద్బుతం అన్నట్లుగా ఉంటాయి. ప్రతి సన్నివేశం కూడా భారీతనంతో కనిపిస్తుంది. అలాంటి సన్నివేశాలను చిత్రీకరించాలంటే లొకేషన్స్ మరియు సెట్టింగ్స్ అదే రేంజ్ లో ఉండాలి. అందుకే శంకర్ భారీతనంకు తగ్గట్లుగా సెట్టింగ్స్ మరియు లొకేషన్స్ ను సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాకు డైలాగ్స్ ను సాయి మాధవ్ బుర్రా రాస్తుండగా.. సంగీతాన్ని థమన్ అందించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక జానీ మాస్టర్ ఈ సినిమాలో చరణ్ తో స్టెప్పులు వేయించబోతున్నాడు.

సినిమాకు సంబంధించిన అసిస్టెంట్స్ నుండి అందరిని ఎంపిక దాదాపుగా పూర్తి అయ్యింది. హీరోయిన్ విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నారు కాని కాస్త ఆలస్యంగా ఆ విషయాన్ని వెళ్లడించే అవకాశం ఉందంటూ సమాచారం అందుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ఆగస్టు వరకు పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో షూటింగ్ ను మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లో నిర్వహించి ఆ తర్వాత షెడ్యూల్ ను తమిళనాడు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం కోట్లు ఖర్చు చేసి భారీగా సెట్టింగ్ లు వేయిస్తున్నారు. సినిమా ను తక్కువ సమయంలోనే పూర్తి చేసేందుకు శంకర్ కంకణం కట్టుకున్నట్లుగా ఉన్నాడు. అందుకే ఏ విషయంలో కూడా ఆలస్యం చేయకుండా చక చక పనులు చక్కబెడుతున్నాడు.

ఆగస్టులో ఈ సినిమా ను పట్టాలెక్కించి వచ్చే ఏడాదికి ముగించి 2023 వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మందికి శంకర్ తో సినిమా చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఎంతో మంది కోరుకుంటున్న అవకాశం చరణ్ కు రావడం పట్ల మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. తెలుగు.. తమిళం మరియు హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా తో చరణ్ రేంజ్ మరింత పెరగడం ఖాయం అంటున్నారు.