'ఆదిపురుష్' పై ఆగని దారుణమైన ట్రోలింగ్..!

Mon Oct 03 2022 11:50:06 GMT+0530 (India Standard Time)

Unstoppable Trolling on 'Adipurush Teaser'..!

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూసిన 'ఆది పురుష్' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ వచ్చేసాయి. ఆదివారం సాయంత్రం అయోధ్యలో వైభవంగా జరిగిన ఈవెంట్ లో మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే దీనికి ఆడియన్స్ ను మిశ్రమ స్పందన లభించింది.రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ''ఆది పురుష్'' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ తో పాటుగా కృతి సనన్ - సైఫ్ అలీఖాన్ - సన్నీ సింగ్ - సోనాల్ చౌహాన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సరికొత్త టెక్నాలజీతో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మైథిలాజికల్ డ్రామాని తెరకెక్కిస్తున్నామని ప్రచారం చేయబడుతూ వచ్చింది.

గతేడాది డిసెంబర్ లోనే షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్.. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. ఇంతవరకూ ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ వదలకుండానే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి.. అందరిలో ఆసక్తిని రెట్టింపు చేశారు. ప్రభాస్ ని రాముడి అవతార్ లో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహ పడ్డారు.

అయితే నిన్న విడుదల చేసిన 'ఆది పురుష్' టీజర్ వారందరినీ ఉసూరుమనిపించినట్లు తెలుస్తోంది. యాంటీ ఫ్యాన్స్ ఐతే సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. స్వంత డార్లింగ్ అభిమానులకు కూడా ఈ కంటెంట్ ను చూసి నోట మాట రాలేదు. పూర్తిగా డిజప్పాయింట్ అయినట్లుగా ట్వీట్లు పెడుతున్నారు.

'ఆది పురుష్' టీజర్ లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని.. వీఎఫ్ఎక్స్ దారుణమని.. సీరియల్ ప్రోమో చూసిన ఫీలింగ్ కలిగిందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇది చిన్న పిల్లల కోసం తీసిన కార్టూన్ సినిమా లేదా యానిమేషన్ మూవీలా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఇది మేకర్స్ నుండి పెద్ద మిస్ కమ్యూనికేషన్ కారణంగానే జరిగిందని తెలుస్తోంది.

'ఆది పురుష్' చిత్రాన్ని మోషన్ పిక్చర్ టెక్నాలజీతో క్యాప్చర్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెలియజేయలేదు. అప్పుడెప్పుడో మోషన్ క్యాప్చర్ వర్క్ స్టార్ట్ అయిందని దర్శకుడు ట్వీట్ చేసాడు కానీ.. అది జనాలకు రీచ్ అయ్యేలా చేయలేకపోయారు.

ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ తో యానిమేషన్ గా రూపొందించబడిన సినిమా అనే సందేశాన్ని మేకర్స్ స్పష్టంగా ప్రేక్షకులకు తెలియజేయకపోవడం.. ఈ సమాచారాన్ని అధికారికంగా అందించకపోవడమే ఈ గందరగోళాన్ని సృష్టించింది. ముందుగానే ప్రమోషన్స్ మొదలుపెట్టి.. ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ చేసిన ఆడియన్స్ ను ముందే ప్రిపేర్ చేసి ఉంటే.. ఇప్పుడు 'ఆది పురుష్' టీజర్ కు ఘోరమైన ట్రోలింగ్ ఉండేదని కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనికి తోడు 'ఆది పురుష్' టీజర్ లో వీఎఫ్ఎక్స్ మరియు సీజీ వర్క్ ఆశించిన స్థాయిలో లేదు. ఎక్కడ కూడా సహజత్వం లేకుండా.. ఒక కార్టూన్ మూవీ చూస్తున్నామనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్నాయి. విజువల్ వండర్ ని అందిస్తారు అనుకుంటే.. టీవీలో ప్రసారమయ్యే సీరియల్ తరహా కంటెంట్ ను అందించారని డార్లింగ్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'ఆది పురుష్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. బరిలో 'వాల్తేరు వీరయ్య' 'వారసుడు' సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ సినిమా తమకు ఏమాత్రం పోటీ కాదని మిగతా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కామెంట్స్ చేసే పరిస్థితి వచ్చింది. మరి రిలీజ్ అయ్యే సమయానికి ప్రేక్షకులను ఏ విధంగా సినిమా కోసం సిద్ధం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.