Begin typing your search above and press return to search.

అక్కినేని ఫ్యామీలీలో రెండు సూపర్ హిట్లు!

By:  Tupaki Desk   |   18 Oct 2021 4:30 PM GMT
అక్కినేని ఫ్యామీలీలో రెండు సూపర్ హిట్లు!
X
అక్కినేని వారసులుగా నాగచైతన్య .. అఖిల్ హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చైతూ ముందుగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే విజయం అనేది ఆయన ఆశించినంత తేలికగా దొరకలేదు. అయినా డీలాపడిపోకుండా తనని తాను మార్చుకుంటూ .. మలుచుకుంటూ ముందుకువెళ్లాడు. అపుడప్పుడు మాత్రమే హిట్లు పలకరించినా, వాటితోనే సర్దుకుంటూ వెళుతున్నాడు. 'మజిలీ' తరువాత ఆయన కెరియర్ ఫరవాలేదు అనుకునే స్థాయికి వచ్చింది. 'లవ్ స్టోరీ' సినిమా మాత్రం ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి ఆకట్టుకుంది. కథాకథనాలు .. పాత్రలను మలిచితీరు .. సన్నివేశాల్లోని సహజత్వం .. పండగ చేసే పాటలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. దాంతో తొలి రోజున .. తొలి ఆటతో ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఆ రోజున మొదలైన వసూళ్ల వర్షం ఇంతవరకూ తగ్గలేదు .. ఆగలేదు. చైతూ కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. ఇక అఖిల్ విషయానికి వస్తే, అదృష్టవంతుడు అనుకోవడానికి కావలసిన అన్ని అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నా, హిట్టు మాత్రం తప్పించుకు తిరగడం మొదలుపెట్టింది.

ఎలాంటి ప్రయత్నం లోపం లేకుండా అఖిల్ నుంచి వెళ్లిన ప్రతి సినిమా బోల్తా పడింది. దాంతో అతనికి ఎలాంటి సినిమా ఇవ్వాలి? ఎలా హిట్టు ఇవ్వాలి అనే టెన్షన్ లో నాగార్జున పడ్డారు. ఒకానొక సమయంలో ఆయనలో ఇది ఒక అసంతృప్తిగా కనిపించింది. అఖిల్ కి ఏ విషయంలోను వంకబెట్టలేం .. ప్రేక్షకులు అతనిని హీరోగా అంగీకరించారు .. కానీ హిట్టు మాత్రం పడటం లేదు. 'ఎక్కడో తేడా కొడుతోంది .. అదేంటన్నది తెలియడం లేదు' అనుకున్న నాగార్జున, అఖిల్ ను అల్లు అరవింద్ కి అప్పగించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఆయన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాను నిర్మించారు.

ఒక కథ ఎలా ఉండాలి? ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి అందులో ఎలాంటి అంశాలు ఉండాలి? హీరో పాత్రను డిజైన్ చేసే తీరు ఎలా ఉండాలి .. కథను అన్ని వైపులా నుంచి బ్యాలెన్స్ చేయడం ఎలా? ఇలాంటి విషయాల్లో అల్లు అరవింద్ కి అపారమైన అనుభవం ఉంది. దాంతో ఆయన అఖిల్ కి తగిన కథను సెట్ చేయడం .. అది పట్టాలపైకి వెళ్లిపోవడం .. థియేటర్లకు వచ్చి హిట్టు పట్టుకెళ్లడం జరిగిపోయాయి. అలా మొత్తానికి అఖిల్ కెరియర్లో తొలి హిట్టు నమోదైంది. అఖిల్ - పూజ హెగ్డే కెమిస్ట్రీ సంగతి అలా ఉంచితే, 'బొమ్మరిల్లు' భాస్కర్ కి ఈ తరహా కంటెంట్ పై ఉన్న గ్రిప్పు ఈ స్థాయి విజయానికి కారణమని కొంతమంది అంటున్నారు.

సెకండ్ వేవ్ తరువాత తెలుగు బాక్సాఫీస్ దగ్గర 'లవ్ స్టోరీ' అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఆ తరువాత ఆ స్థాయి హిట్ చిత్రంగా అఖిల్ మూవీ నిలవడం విశేషం. నెలలోపు తేడాతో వచ్చిన ఈ సినిమాలు వసూళ్ల పరంగా థియేటర్లను దడదడ లాడించేస్తున్నాయి. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాకి అఖిల్ కెరియర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రావడం, ఇప్పటికీ కూడా చైతూ 'లవ్ స్టోరీ' వసూళ్లు ఎంతమాత్రం తగ్గకపోవడం నాగార్జునకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. తన తనయుల కెరియర్ విషయంలో కొంత టెన్షన్ పడుతున్న నాగ్ కు ఇంతకు మించిన రిలీఫ్ లేదనే చెప్పాలి. ఈ సారి దసరా పండుగా చైతూ సినిమాతో మొదలై, అఖిల్ సినిమాతో పూర్తికావడం అక్కినేని అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయమని వేరే చెప్పాలా?