Begin typing your search above and press return to search.

సంక్రాంతి వార్ లో పోటాపోటీగా నిలిచిన ఇద్దరు డెబ్యూ హీరోలు..!

By:  Tupaki Desk   |   18 Jan 2022 2:50 AM GMT
సంక్రాంతి వార్ లో పోటాపోటీగా నిలిచిన ఇద్దరు డెబ్యూ హీరోలు..!
X
సంక్రాంతి సీజన్ లో ఎప్పటిలాగే ఈసారి కూడా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అందులో ఒకటి పెద్ద సినిమా అయితే మిగిలినవి చిన్న చిత్రాలు. ముందు నుంచీ అందరూ అనుకున్నట్లుగానే అక్కినేని తండ్రీకొడుకులు నటించిన 'బంగారాజు' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టి సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది. ఆ తర్వాత పండక్కి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమాలు 'రౌడీ బాయ్స్' మరియు 'హీరో'.

మెగా మేనల్లుడి 'సూపర్ మచ్చి' చిత్రాన్ని మెగా ఫ్యాన్స్ కూడా పట్టించుకోకపోవడంతో.. మిగతా రెండు సినిమాలే బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా కలెక్షన్స్ రాబట్టాయి. ఇక 'హీరో' & 'రౌడీ బాయ్స్' చిత్రాలకు కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలూ హీరోల లాంచింగ్ మూవీస్. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా కృష్ణ మనవడిగా అశోక్ గల్లా ''హీరో'' చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. సినీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో పాటుగా అశోక్ కు రాజకీయ నేపథ్యం కూడా ఉంది.

మరోవైపు 'రౌడీ బాయ్స్' సినిమాతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అయ్యాడు. వారసుల లాంచింగ్ కోసం హోమ్ బ్యానర్స్ లోనే ఈ రెండు సినిమాలను భారీ బడ్జెట్ తో రూపొందించారు. వీటిల్లో క్రేజీ హీరోయిన్లను టాప్ టెక్నిషియన్స్ ను భాగం చేశారు. ఒక సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తే మరో చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. హీరోలతో పోలిస్తే వీరిద్దరూ స్టార్లే. అంతేకాదు డెబ్యూ హీరోలిద్దరితో ముద్దుగుమ్మలు లిప్ లాక్స్ - రొమాంటిక్ సీన్స్ చేశారు.

ఒక సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తే మధే సినిమాటోగ్రఫీ అందించారు. మరో చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తే.. సమీర్ రెడ్డి - రిచర్డ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రెండు సినిమాలు కూడా యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని తెరకెక్కినవే. ఇలా రెండు చిత్రాల్లోనూ చాలా కామన్ పాయింట్స్ కనిపిస్తాయి.

సినిమాలు రిలీజ్ అయ్యాక కూడా డెబ్యూ హీరోలు ఒకే రకమైన ఫీడ్ బ్యాక్ అందుకున్నారు. ఇద్దరూ తొలి సినిమా హీరోలని అనిపించకుండా పెర్ఫార్మ్ చేశారు. అశోక్ గల్లా కామెడీ టైమింగ్ - స్టైలిష్ డ్యాన్స్ అండ్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. మరోవైపు ఆశిష్ రెడ్డి కూడా డ్యాన్స్ మరియు ఫైట్స్ తో అలరించాడు. ఇద్దరు కొత్త హీరోలు మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకొని.. యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆడియన్స్ అంటున్నారు.

ఎలాగూ ఇద్దరికీ సినీ బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి మంచి కథల్ని ఎంపిక చేసుకుని నటనపై దృష్టి పెడితే హీరోలుగా నిలబడే అవకాశం ఉంది. సినిమాల విషయానికొస్తే 'హీరో' కంటే ఎక్కువ థియేటర్లలో 'రౌడీ బాయ్స్' రిలీజ్ అయింది. దీంతో వీకెండ్ లో వసూళ్ళు కూడా ఆశిష్ సినిమాకే కాస్త ఎక్కువ వచ్చాయని తెలుస్తోంది. మొత్తానికి సినిమా ఫలితాలు ఎలా ఉన్నా..ఇద్దరూ కొత్త హీరోలు సంక్రాంతి వార్ లో పోటాపోటీగా నిలిచారు. మరి రాబోయే రోజుల్లో తమకంటూ ప్రత్యేకత చాటుకుంటారో లేదో చూడాలి.