మరోసారి ఓటీటీ విడుదలకే మొగ్గుచూపిన ఇద్దరు స్టార్ హీరోలు..!

Wed Nov 24 2021 12:44:23 GMT+0530 (IST)

Two Star Heroes Who Once Again Opted For Ott Release

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ - బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్ - సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం ''అత్రాంగి రే''. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ఈ క్రేజీ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. అయితే థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేస్తూ డైరెక్ట్ ఓటీటీ విధానంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.''అతరంగీ రే'' సినిమా ఓటీటీ విడుదల గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్ స్టార్ వేదికగా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన చిత్రబృందం.. కొన్ని ఆసక్తికరమైన పోస్టర్స్ ను రిలీజ్ చేసింది. ఇంతకముందు ధనుష్ హీరోగా నటించిన 'జగమే తంత్రం' - అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన 'లక్ష్మీ' సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'అత్రాంగి రే' మూవీతో మరోసారి ఇద్దరు స్టార్ హీరోలు ఓటీటీ బాట పడుతున్నారు.

అక్షయ్ కుమార్ - ధనుష్ - సారా అలీఖాన్ కలిసి నటిస్తున్న 'అత్రాంగి రే' సినిమాపై మంచి అంచాలను నెలకొన్నాయి. వీరు ముగ్గురు కలిసి చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది. అలానే ధనుష్ నటిస్తున్న మూడో స్ట్రెయిట్ మూడో హిందీ మూవీ. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈరోజు బుధవారం చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ది నిజమైన పాత్ర కాదని.. సారా అలీఖాన్ కలల రాకుమారుడుగా కనిపిస్తారని సమాచారం. అక్షయ్ లాంటి అందగాడితో ప్రేమను ఊహించకున్న సారా.. ధనుష్ ను వివాహం చేసుకోవాల్సి వస్తుందట. సారా పాత్ర ఊహలకు తగ్గట్టు తనను మార్చుకుంటూ ఆమె ప్రేమను పొందాలనే తపించే ప్రేమికుడిగా ధనుష్ నటన ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.

'అత్రాంగి రే' చిత్రాన్ని టీ సిరీస్ - కేఫ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ - కలర్ ఎల్లో బ్యానర్స్ పై రూపొందిస్తున్నారు. భూషణ్ కుమార్ - కిషన్ కుమార్ - ఆనంద్ ఎల్ రాయ్ - హిమాన్షు శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. హిమాన్షు శర్మ అందించిన విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి ప్రేక్షకాదరణ అందుకుంటుందో చూడాలి.