'నారప్ప' సినిమా నేపథ్యంలో తెలుగు vs తమిళ ఫ్యాన్స్ ట్విట్టర్ వార్..!

Wed Jul 21 2021 11:08:28 GMT+0530 (IST)

Twitter War Between Dhanush and Venkatesh Fans

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ "నారప్ప''. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ - వెట్రిమారన్ కాంబోలో రూపొందిన బ్లాక్ బస్టర్ 'అసురన్' చిత్రానికి ఇది అధికారిక తెలుగు రీమేక్. వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై కలైపులి ఎస్.థాను - సురేష్ బాబు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా పేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. ఏదైతేనేం సమ్మర్ లో వెండితెరపై విడుదల అవ్వాల్సిన 'నారప్ప' చివరకు చిన్న తెరపైకి వచ్చింది.  

ఇప్పటికే రీమేక్ చిత్రాలతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న వెంకీ.. 'నారప్ప' సినిమాతో మెప్పించారని తెలుగు ఆడియన్స్ అంటున్నారు. వేర్వేరు షేడ్స్ ఉండే పాత్రలో జీవించారని.. ఎమోషన్ పండించారని మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో 'అసురన్' ని 'నారప్ప' రీచ్ అవ్వలేకపోయాడని తమిళ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అమెజాన్ లో 'నారప్ప' స్ట్రీమింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో దీని గురించే తెలుగు - తమిళ ఆడియన్స్ మధ్య కామెంట్ల వార్ జరుగుతోంది.  

'అసురన్' ని మక్కీకి మిక్కీ దించినా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారని.. ధనుష్ ని వెంకటేష్ మ్యాచ్ చేయలేకపోయాడని తమిళ ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి వెంకటేష్ తన వయసుకు తగిన పాత్రలో అదరగొట్టాడని.. కొన్ని సన్నివేశాల్లో ధనుష్ ని మరిపించారని.. తమిళులు చేసే 'అతి' ని తగ్గించి పెర్ఫార్మన్స్ చేసాడని తెలుగు అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.

గతంలో వెంకటేష్ నటించిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాన్ని ధనుష్ రీమేక్ చేసిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా ట్విట్టర్ లో పరస్పర విమర్శలు చేసుకుంటూ టాలీవుడ్ వెర్సెస్ కోలీవుడ్ అనే విధంగా ట్వీట్లు పెడుతున్నారు.

వాస్తవానికి తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే తమిళ చిత్రాలను ప్రోత్సహిస్తూ ఉంటారు. తెలుగు హీరోల మాదిరిగానే కోలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు ఇక్కడ భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుంటారు. అయినా సరే టాలీవుడ్ హీరోల చిత్రాలపై తమిళులు నెగెటివ్ కామెంట్స్ పెడుతుంటారని తెలుగు ఆడియన్స్ అంటున్నారు.

ఈ సందర్భంగా సోమవారం రాత్రి 10 గంటలకు స్ట్రీమింగ్ అయిన 'నారప్ప' చిత్రానికి.. 11 గంటలకే కొన్ని తమిళ వెబ్ సైట్స్ నెగెటివ్ రివ్యూస్ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇన్ సెక్యూర్ ఫీల్ అవడం వల్లనే టాలీవుడ్ హీరోలపై ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని అంటున్నారు.  

ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేస్తుంటే.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ #RC15 అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపొందించనున్నారు. అలానే రామ్ పోతినేని హీరోగా దర్శకుడు లింగుస్వామి ఓ బైలింగ్విల్ సెట్స్ పైకి తీసుకెళ్లారు.

మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా చేయనున్నాడు. వంశీ పైడిపల్లి - విజయ్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనుంది. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు - తమిళ ఫిలిం మేకర్స్ హీరోలు కలిసి చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు - తమిళ అభిమానులు రోజుల్లో సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోడానికి ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.