Begin typing your search above and press return to search.

`మా`.. ఎన్నిక‌ల్లో సూప‌ర్ ట్విస్ట్‌.. ఆమెకు బాల‌య్య మ‌ద్దతు!

By:  Tupaki Desk   |   23 Jun 2021 3:30 PM GMT
`మా`.. ఎన్నిక‌ల్లో సూప‌ర్ ట్విస్ట్‌.. ఆమెకు బాల‌య్య మ‌ద్దతు!
X
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల్లో వేడి రాజుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి, నాగార్జున‌ మ‌ద్ద‌తు ఉన్న వారు గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.. వారి మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ తెర‌మీదికి వ‌చ్చింది. న‌ట సింహం నంద‌మూరి బాల‌య్య కూడా మా.. ఎన్నిక‌ల్లో కీల‌కంగా మారారు. ఆయ‌న మ‌ద్ద‌తుగా జీవితా రాజ‌శేఖ‌ర్ బ‌రిలోకి దిగుతున్న‌ట్టు తెలుస్తోంది.

అధ్యక్ష పదవికి బరిలో దిగిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్లు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ నటీనటుల మద్దతు కూడగట్టుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. ఇప్పటికే చిరంజీవి మద్దతుతో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండగా.. తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.

ఈ క్రమంలో మా ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రస్తుతం 'మా'లో కార్యదర్శిగా ఉన్న జీవిత రాజశేఖర్ అధ్యక్ష పదవిపై దృష్టి సారించారు. తానూ ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు 'మా' ఎన్నికలను చిరంజీవి, మోహన్ బాబు మాత్రమే ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా.. జీవిత రాజశేఖర్ పోటీలోకి దిగడం వల్ల సినీ పరిశ్రమలో అంచనాలు మారిపోయాయి.

అయితే జీవిత రాజశేఖర్కు నందమూరి బాలకృష్ణ మద్దతు ఇస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య మద్దతుతో జీవిత 'మా' అధ్యక్ష పదవిని సునాయాసంగా కైవసం చేసుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు చిరంజీవి మద్దతుదారులంతా ప్రకాశ్ రాజ్ వైపు మొగ్గు చూపుతుండగా.. మోహన్ బాబు మాత్రం కుమారుడిని గెలిపించుకునేందుకు సీనియర్ నటీనటులతో మంతనాలు సాగిస్తున్నారు.

అక్కినేని నాగార్జున మద్దతు కూడా చిరంజీవి జట్టువైపే ఉంటుందనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఒక్కటిగా కలిసుందామని పిలుపునిచ్చే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అధ్యక్ష ఎన్నికలు సినీపరిశ్రమను మరోసారి మూడు వర్గాలుగా చీల్చబోతున్నా యని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా జీవిత రాజశేఖర్ వైపు బాలయ్య దృష్టి సారించడం వల్ల ఈసారి 'మా' ఎన్నికలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదని అసోసియేషన్లోని సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ముగ్గురే కాకుండా మరో సీనియర్ సహాయనటి హేమ కూడా 'మా' అధ్యక్ష పదవికి కోసం పోటీ చేయాలని నిర్ణయించుకుంది. గతంలో మా అసోసియేషన్ లో ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పనిచేసిన హేమ.. మహిళ నటీమణుల మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇంకేముంది.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రాన్ని `మా` మించిపోతుంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.