రెండో రోజూ కొనసాగిన హరీష్ శంకర్ - జర్నలిస్టుల మధ్య ట్వీట్ వార్..!

Mon Sep 13 2021 20:00:01 GMT+0530 (IST)

Tweet war between journalists And Harish Shankar

రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయి తేజ్ గురించి పలు న్యూస్ ఛానల్స్ లో వచ్చిన తప్పుడు వార్తలపై డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ''హాట్సాఫ్ తమ్ముడు సాయి తేజ్.. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్. నీ ఆక్సిడెంట్ వంకతో.. తప్పుడు వార్తలు అమ్ముకొని బతికేస్తున్న అందరు బాగుండాలి. వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను'' అని పేర్కొంటూ హరీష్ ట్వీట్ పెట్టడం సంచలనంగా మారింది. దీనిపై ప్రముఖ మీడియా జర్నలిస్ట్ స్పందిస్తూ.. ''మీడియా వాళ్ళని విమర్శించడం ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. తప్పుడు కథలు కథనాలు హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరు కోట్లు సంపాదించుకోవచ్చు కానీ తప్పుడు వార్తలు అంటూ తప్పు పడతారు. అతి వేగంతో వెళ్లి మీరు ప్రమాదానికి గురికావడం కాదు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు తెస్తున్నారు'' అని ట్వీట్ చేశారు.''నేను తప్పుడు వార్తలు అని క్లియర్ గా మెన్షన్ చేశాను కదా.. మీరెందుకు అందరికంటే ముందు భుజాలు తడుముకుంటున్నారు. అంటే ఒప్పుకున్నట్టేనా? సినిమాల్లో హింస అన్నారు మాకు సెన్సార్ ఉంది మేము వాళ్లకు జవాబు చెప్పాలి. మీకేముంది మీరు దేనికి జవాబు చెప్పాలో కాస్త చెబుతారా? నేను మీ వ్యవస్థని తప్పు పట్టట్లేదు.. వ్యవస్థని తప్పుదోవ పట్టించేవాళ్ల గురించి చెబుతున్నాను. దయచేసి ఇష్యూని అర్థం చేనుకోండి'' అంటూ హరీష్ మరో ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ట్వీట్ వార్ జరిగింది. అయితే అది రెండో రోజు కూడా కొనసాగింది. ఈ ట్వీట్ తో వివాదాన్ని ముగిస్తున్నానని పేర్కొంటూ జర్నలిస్ట్ సోమవారం మరో ట్వీట్ చేశారు.

''హరీష్ శంకర్ గారు  మీరు కూడా పటాన్ చెరులో ఈనాడు స్ట్రింగర్(విలేకరి లేదా జర్నలిస్ట్)గా పనిచేసిన అనుభవం ఉంది కదా? జర్నలిజం ఏలా ఉంటుందో తెలుసుకున్నవారు మీరు. అనుభవం కూడా ఉంది మీకు. జర్నలిస్ట్ టూ డైరెక్టర్ అయ్యారు. ఒక స్ట్రింగర్ గా మీరు వేసిన కరెక్ట్ వార్తల జాబితా పెడితే కనీసం వాటిని స్పూర్తిగా తీసుకుని ఒక జర్నలిస్ట్ గా మిమ్ములను ఆదర్శంగా తీసుకుని చాలా మంది మిత్రులు చెప్పినట్లుగా సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆడవాళ్లకు సగం గుడ్డలు వేసి అశ్లీల డ్యాన్స్ ను చేపిస్తూ సినిమాలు తీసి సభ్య సమాజంలో వదులుతారు. సెక్స్ సీన్ చూపించి పవిత్రమైన 'యోగ' అని సంభోదిస్తారు. అది మీకే చెల్లుతుంది. అలాంటి కంటెంట్ సమాజంపై ఏలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో మీకు తెలియంది కాదు''

''న్యూస్ వల్లనే సమాజం మొత్తం చెడిపోతుందా? కొన్ని (కొన్ని మాత్రమే) సినిమాలు చూసి అత్యాచారాలు జరుగుతున్నాయి. హత్యలు జరుగుతున్నాయి. ముక్కుపచ్చలారని చిన్నపిల్లలపై ఘోరాలు జరుగుతున్నాయి. కానీ న్యూస్ చూసి నేరాలు చేసిన దాఖలాలు కనిపించవు. కేవలం (మీలాంటి దర్శకులు మాత్రమే అందరూ కాదు.) మీకు జర్నలిజం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? అనేదే నా ప్రశ్న. సమాజంలో 90శాతం మంది సినిమాలు చూస్తారు. కేవలం 20శాతం మంది మాత్రమే న్యూస్ పాలో అవుతారు. అంటే సినిమాలతోనే ప్రభావితం అయ్యే వ్యక్తులు 90శాతమంది మంది. అలాంటప్పుడు మీరు ఏలాంటి సినిమాలు తీస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోండి. నటులకు దర్శకులకు మొత్తం సినిమావాళ్లకు ఎక్కువ పాలోయింగ్ ఉంటుంది. అందుకే మీకు మిలియన్లలో పాలో అవుతుంటారు. మీరు రోల్ మోడల్స్ వాళ్లకు. అలాంటి వాళ్లు ఏలా ఉండాలి? ఏలాంటి కంటెంట్ తో సినిమాలు తీయాలి. ఏలా ట్వీట్లు చేయాలి? మాకు మాత్రమే సూక్తులు చెబుతారా? మీకు వర్తించవా?" అని సదరు జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. దీనికి హరీష్ శంకర్ సినిమాలకు సంబంధించిన స్క్రీన్ షార్ట్స్ జత చేశారు.

హరీష్ శంకర్ కూడా జర్నలిస్ట్ ట్వీట్ లు అదే విధంగా సమాధానం ఇచ్చారు. ''నా సినిమాల్లో ఇంకా అందమైన దృశ్యాలు ఉన్నాయ్ కేవలం ఇవే మీకు దొరికాయంటే మీది ఎంత 'పూర్ టేస్ట్' అండీ.. "ప్రసార మాంద్యం" అనే భాషా పాండిత్యం ఉన్న మీకు "యోగం" అన్నా "యోగా" అన్నా సెక్స్ అనే అర్థం అవుతుంది అందుకు నేను ఆశ్చర్య పోవట్లేదు! సాయి తేజ్ 300km వేగం తో వెళ్లడం ఎంత నిజమో.. నేను స్టింగర్ or జర్నలిస్ట్ గా పని చేశా అన్నది కూడా అంతే నిజం. నిజంగా నేను జర్నలిస్టుగా పనిచేసి ఉంటే ఇన్నేళ్ల నా సినిమా జీవితంలో జర్నలిస్టుల ముందే ఎంతో గర్వంగా చెప్పుకునే వాడిని. మీ రీసెర్చ్ లో కూడా ఫిక్షన్ మిక్స్ చేసినందుకు జోహార్లు. మీరు చెప్పిన సో కాల్డ్ సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతోనే చాలా మందికి సేవ చేసే అదృష్టం నాకు కలిగింది. ఫస్ట్ వేవ్ అప్పుడు మన జర్నలిస్ట్ మిత్రులకి ఆ సినిమాల డబ్బుతోనే సహాయం చేశాను అది సహాయం అని కూడా అనుకోలేదు నా సక్సెస్ లో భాగమైన నా మిత్రుల పట్ల నా బాధ్యత అనుకున్నా. మీరేమి చేశారో సెలవిస్తే ఖచ్చితంగా నేర్చుకుంటా..''

''మొత్తం మీ లెటర్ లో మీ కామెడీలు నాకు నచ్చాయి. ఈ సారి ఆడిషన్స్ ఉన్నప్పుడు చెబుతాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసుకోండి. అయినా నా సినిమాలు మెరుగైన వినోదం కోసం అనే చెప్పాను కానీ మెరుగైన సమాజం కోసం అని చెప్పలేదు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ముగిస్తున్నా అని అనడానికి ఇది మీ ఛానల్ లో చేసే ప్రోగ్రాం కాదు పబ్లిక్ ప్లాట్ ఫార్మ్... మీ ఓపిక ఉన్నంత వరకు కంటిన్యూ చేయండి... నాకు వీలున్నప్పుడల్లా నేను రిప్లై ఇస్తా!!'' అని హరీష్ శంకర్ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే జర్నలిస్ట్ కూడా దీనికి ప్రతిస్పందన ఇచ్చారు. ''ఓకే డన్ కాకపోతే మీరు అవకాశం ఇస్తే మీ సినిమాలో నటించే సమయం సహనం నాకులేదు. కరోనాలో ఏం చేశావు అన్నారుగా వందల మందికి ఇది చేశాను చూడండి మీరు జర్నలిస్ట్ కాకపోయినా నా తోటి జర్నలిస్ట్ మిత్రుల పట్ల మీకున్న ఔదార్యానికి థాంక్స్ ముగించొద్దు కంటిన్యూ  చేద్దాం. కాకపోతే నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా పనిలో ఉన్నారు. అది డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. గబ్బర్  సింగ్ లాంటి మరో బ్లాక్ బాస్టర్ రావాలని కోరుకుంటున్నాను కళ్యాణ్ గారి కోసం. ఇక ఆపేయడం కంటిన్యూ చేయడం మీ విచక్షణ'' అని ట్వీట్ చేస్తూ కొన్ని ఫోటోలను జర్నలిస్ట్ జత చేశారు. దీనికి 'థాంక్యూ మై న్యూ లవ్.. సర్వేజనా సుఖినోభవంతు'' అంటూ హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు.