Begin typing your search above and press return to search.

'జోంబీ రెడ్డి' టైటిల్ పై ట్రోల్స్...!

By:  Tupaki Desk   |   8 Aug 2020 7:30 AM GMT
జోంబీ రెడ్డి టైటిల్ పై ట్రోల్స్...!
X
సినిమా టైటిల్స్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సినిమా కథకు సరిపడేలా.. హీరో క్యారక్టర్ ని ఎలివేట్ చేసేలా మూవీ టైటిల్ ఉంటే జనాల్లోకి బాగా రీచ్ అవుతుందని నమ్ముతారు. ఈ క్రమంలో కొన్ని సామాజిక వర్గాలకి చెందిన పేర్లను కూడా సినిమా టైటిల్స్ కి జతచేస్తూ వచ్చారు. వాటిలో కొన్ని కథ డిమాండ్ చేయడం వల్ల టైటిల్స్ లో క్యాస్ట్ ప్రస్తావన తీసుకురాగా మరికొన్ని సినిమాలు అవసరం లేకున్నా కేవలం క్రేజ్ కోసం సామాజిక వర్గానికి సంబందించిన పేర్లను జతచేస్తుంటారు. అయితే ఎవరూ ఊహించనంతగా వాటిలో చాలా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'మాలపిల్ల' 'జస్టిస్ చౌదరి' 'రాయలసీమ రామన్న చౌదరి' నాయుడుగారి కుటుంబం' 'నాయుడుగారి బావ' 'నాయుడుగారబ్బాయి' 'నరసింహనాయుడు' 'సమరసింహారెడ్డి' 'చెన్నకేశవరెడ్డి' 'భరతసింహారెడ్డి' 'పల్నాటి బ్రహ్మనాయుడు' 'సీమశాస్త్రి' 'అర్జున్ రెడ్డి' 'శైలజారెడ్డి అల్లుడు' 'సైరా నరసింహారెడ్డి' 'జార్జ్ రెడ్డి' వంటి సినిమాలు టాలీవుడ్ లో రూపొందించబడ్డాయి. అయితే వీటిలో కొన్ని రియల్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని అవసరం కొద్దీ అలాంటి టైటిల్స్ గా పెట్టగా.. మిగతావి క్రేజ్ కోసం పెట్టిన చిత్రాలు అని చెప్పవచ్చు.

అయితే ఈ ఫార్ములా బాగానే వర్కౌట్ అయినప్పటికీ కొన్ని క్యాస్ట్ లను ప్రతిభింబించేలా పాత్రల పేర్లు తీరుతెన్నులు ఉండటం.. వారిని మరీ నెగిటివ్ గా చూపిస్తూ వస్తుండటం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిని వాటిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతూ వచ్చారు. అందువల్ల ఈ మధ్య మేకర్స్ టైటిల్స్ విషయంలో.. క్యారెక్టర్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అయినప్పటికీ అప్పుడప్పుడు వీటి విషయంలో వివాదాలు చెలరేగుతూనే వచ్చాయి. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో ఓ సామాజిక వర్గాన్ని తీసుకొని ఫ్యాక్షన్సిస్టులుగా చెప్తూ మితిమీరిన హింసను చూపించారని ఓ స్టూడెంట్ వింగ్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లేటెస్టుగా టాలీవుడ్ లో ''జోంబీ రెడ్డి'' అనే సినిమా రూపొందుతోంది.

కాగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ''జోంబీ రెడ్డి'' చిత్రానికి రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో రూపొందుతున్న ఫస్ట్ జోంబీ సినిమా అని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే కర్నూల్ కొండారెడ్డి బురుజు ని చూపిస్తూ ఒక వైరస్ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని అనౌన్స్ మెంట్ పోస్టర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వర్మ.. ఈ రోజు టైటిల్ అనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఓ స్మశాన వాటికను చూపిస్తూ థ్రిల్‌ తో పాటు హార‌ర్ జోన‌ర్‌ లో ఈ సినిమాని రూపొందించ‌నున్నాడా అనే అనుమానం కలిగించాడు. అయితే ఈ సినిమాకి ''రెడ్డి'' అనే ఓ సామాజిక వర్గానికి చెందిన పేరుని వాడటంపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వైరస్ కి 'రెడ్డి'కి ఏమి సంబంధం ఉందని 'జోంబీ రెడ్డి' అనే టైటిల్ పెట్టారని ప్రశ్నిస్తున్నారు. మీ సినిమాకి క్రేజ్ తీసుకురావడం కోసం ఓ సామాజిక వర్గాన్ని వాడుకొని కాంట్రవర్సీ చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి 'జోంబీ రెడ్డి' టైటిల్ పెట్టడానికి.. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడానికి గల కారణాలను డైరెక్టర్ వివరించి దీనిపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.