Begin typing your search above and press return to search.

మహేష్ కోసం త్రివిక్రమ్ ప్లాన్స్ మామూలుగా లేవుగా..!

By:  Tupaki Desk   |   20 May 2022 7:34 AM GMT
మహేష్ కోసం త్రివిక్రమ్ ప్లాన్స్ మామూలుగా లేవుగా..!
X
సూపర్ స్టార్ మ‌హేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది మహేశ్ కెరీర్ లో 28వ చిత్రం. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబడిన ఈ చిత్రాన్ని.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈలోగా #SSMB28 మూవీకి సంబంధించి అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

మహేశ్ మూవీలో ఓ కీలక పాత్రలో మరో హీరో నటించనున్నారని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది గెస్ట్ రోల్ కు మించి వుంటుందని.. దీని కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోలని సంప్రదిస్తున్నారని టాక్ నడుస్తోంది.

SSMB28లో స్పెషల్ క్యారక్టర్ కోసం టాలీవుడ్ యంగ్ హీరోలైన శర్వానంద్ లేదా నితిన్.. లేదా నాని లలో ఎవరైనా ఒకరు సెట్ అవుతారని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఇది 'అల వైకుంఠపురములో' చిత్రంలో అక్కినేని హీరో సుశాంత్ ప్లే చేసిన పాత్ర తరహాలో ఉంటుందని టాక్ వచ్చింది.

అలానే అది చాలా వరకు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని.. చివరికి పాజిటివ్‌ గా మారుతుందని అంటున్నారు. అలాంటి పాత్ర చేయడానికి ఏ హీరో అంగీకరిస్తారు? అసలు ఇందులో నిజమెంతనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

'అతడు' 'ఖలేజా' తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కలయికలో రాబోతోన్న SSMB28 సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. 'సర్కారు వారి పాట' సక్సెస్ జోష్ లో ఉన్న మహేష్.. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇందులో 'మహర్షి' హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి సూపర్ స్టార్ తో జోడీ కట్టనుంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.

#SSMB28 రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలు కానుందని ఇటీవల మహేశ్ బాబు బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే అంతకంటే ముందు మే 31న నటశేఖర కృష్ణ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.