పవన్ సినిమాలో త్రివిక్రమ్ హ్యాండ్?

Tue Oct 27 2020 13:40:25 GMT+0530 (IST)

Trivikram Remains Only A Presenter For This Powerstar Film

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘జల్సా’తో మొదలైన వీరి సినిమా బంధం.. ఆ తర్వాత వ్యక్తిగత స్థాయికి వెళ్లింది. ఇద్దరూ ఆప్త మిత్రులయ్యారు. పవన్‌తో ఆ తర్వాత రెండు సినిమాలు తీయడమే కాదు.. అతడి వేరే సినిమాల్లోనూ భాగస్వామిగా ఉన్నాడు త్రివిక్రమ్. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో పవన్ నటించిన ‘తీన్ మార్’కు త్రివిక్రమ్ రచన చేసిన సంగతి తెలిసిందే. అలాగే ‘గబ్బర్ సింగ్’కు కూడా కొంత ‘మాటల’ సాయం చేశాడు. మరోవైపు నితిన్ హీరోగా పవన్ నిర్మించిన ‘చల్ మోహన రంగ’కు కూడా కథ అందించాడు. ఇప్పుడు పవన్ చేయబోయే మరో కొత్త సినిమాకు త్రివిక్రమ్ రచనా సహకారం అందిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.దసరా సందర్భంగా యువ దర్శకుడు సాగర్.కె.చంద్ర డైరెక్షన్లో పవన్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్. ఐతే రెండు సినిమాలు అవి కూడా చిన్నవి చేసిన సాగర్‌తో సినిమా చేయడానికి పవన్ ఓకే చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐతే ఈ రీమేక్ సినిమా చర్చల్లో త్రివిక్రమ్ పాల్గొనడమే కాక.. మాటలు అందించడానికి కూడా రెడీ అవడంతోనే పవన్ ఈ సినిమాను ఓకే చేశాడని అంటున్నారు. ఈ సినిమా తెరకెక్కుతున్నది త్రివిక్రమ్ మాతృ సంస్థ అనదగ్గ ‘హారిక హాసిని’కి ఉప సంస్థలో భాగమే అయిన ‘సితార’లో. పైగా ఇందులో పవన్ హీరో. దీంతో త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టులో బాగా ఇన్వాల్వ్ అయ్యారని ఆయనిచ్చిన భరోసాతోనే పవన్ ఈ సినిమా చేస్తున్నాడని సమాచారం. ‘అయ్యప్పనుం కోషీయుం’లో పవన్ చేయబోయే పాత్ర దృష్ట్యా చూస్తే.. త్రివిక్రమ్ డైలాగులు దానికి బాగా ప్లస్ అయ్యే అవకాశముంది. మరి మిత్రుడి కోసం త్రివిక్రమ్ తన పెన్ పవర్ ఏ స్థాయిలో చూపిస్తాడో చూడాలి.