త్రివిక్రమ్ కు తప్పని సోషల్ మీడియా తిప్పలు..!

Sat Nov 27 2021 14:00:02 GMT+0530 (IST)

Trivikram No accounts on social media

ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టిక్కెట్ ధరలు మరియు రోజుకు నాలుగు షోల నిర్ణయం మీద ఇండస్ట్రీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ హీరో చిరంజీవి ట్వీట్ చేయగా.. సీఎంతో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా పునరాలోచిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే ఏపీ టికెట్ ఇష్యూ మీద దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసారని.. దీనిపై మంత్రి స్పందిస్తూ సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారని ఓ తెలుగు దినపత్రిక ప్రచురించింది. అయితే త్రివిక్రమ్ కు ట్విట్టర్ ఖాతానే లేదని.. అవి ఆయన చేసిన ట్వీట్స్ కాదని తాజాగా క్లారిటీ వచ్చింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి పోస్టులు చెయ్యలేదని.. ఆయనకు సంబంధించిన ఏవైనా అధికారిక ప్రకటనలు తమ నిర్మాణ సంస్థ లేదా తన నుంచే వస్తాయని నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ''త్రివిక్రమ్ గారి నుండి ఏదైనా అధికారిక ప్రకటనలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ (త్రివిక్రమ్ హోమ్ ప్రొడక్షన్ హౌస్) నుండి మాత్రమే వస్తాయి.

ఆయనకు సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్స్ లేవు. అతని ఫోటో/పేరుతో కూడిన వివిధ ప్రొఫైల్స్ నుంచి చేసిన వ్యాఖ్యలను దయచేసి నమ్మవద్దు'' అని ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ సీఎం - మంత్రి పేర్ని నాని - ఏపీ గవర్నమెంట్ అఫిషియల్ పీఆర్ పేజీ ట్విట్టర్ హ్యాండిల్స్ ను ట్యాగ్ చేసారు.

ఇక సినిమాల విషయానికొస్తే 'అల వైకుంఠపురములో' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతం 'భీమ్లా నాయక్' చిత్రానికి స్క్రీన్ ప్లే - మాటలు అందిస్తున్నారు. దీని తర్వాత మహేష్ బాబు తో హ్యాట్రిక్ మూవీ చేయనున్నట్లు ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ స్నేహితుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే.