పవన్ సినిమా..డైరెక్టర్ ఎవరైనా అంతా ఆయనే?

Sun Jun 26 2022 18:00:02 GMT+0530 (IST)

Trivikram In Pawankalyan Movie

ఈ మధ్య మన స్టార్ డైరెక్టర్ లు సైడ్‌బిజినెస్ పై పడ్డారు. డైరెక్టర్లు గా క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తూనే సమయం చిక్కినప్పుడల్లా చిన్న సినిమాలకు ఇతర మూవీస్ కి వర్క్ చేస్తున్నారు.. భారీగానే దండుకుంటున్నారు. కొంత మంది స్టార్ డైరెక్టర్లు నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తుంటే కొంత మంది డైరెక్టర్లు మాత్రం కథలో మార్పులు డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందిస్తూ భారీ స్థాయిలో పారితోషికాలు సొంతం చేసుకుంటున్నారు. ఈ విషయంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముందు వరుసలో నిలుస్తున్నారు.స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుంటే త్రివిక్రమ్ మాత్రం డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందిస్తూ వస్తున్నారు. సుకుమార్ `ఉప్పెన` 18 పేజేస్ సాయి ధరమ్ తేజ్ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. త్రివిక్రమ్ పవర్ స్టార్ సినిమాలకు డైలాగ్స్ స్క్రీన్ ప్లే బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఇటీవల పవన్ నటించిన రీమేక్ మూవీ `భీమ్లా నాయక్`కు డైలాగ్స్ స్క్రీన్ ప్లే బాధ్యతల్ని నిర్వర్తించారు. ఆ పరంగా భారీగానే పారితోషికం తీసుకున్నారట.

తాజాగా పవన్ కల్యాణ్ మరో రీమేక్ కు సైలెంట్ గా శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తమిళంలో నటుడు సముద్రఖని నటించి తెరకెక్కించిన మూవీ `వినోదాయ సితం`. ఈ మూవీని పవన్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సముద్రఖని డైరెక్ట్ చేస్తుండగా కీలక పాత్రలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నారు. దీనికి త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. అయితే పేరుకి ఆయన డైరెక్టర్ కాదన్నమాటే కానీ పెత్తనం మొత్తం ఆయనదే అని తెలుస్తోంది.

గతంలో పవన్ నటించిన `తీన్ మార్` మూవీకి జయంత్ సి. పరాన్జీ డైరెక్టర్ అయినా త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించి డామినేట్ చేశాడు. ఇటీవల `భీమ్లానాయక్` కు కూడా ఇదే తరహాలో వ్యవహరించడం తో దర్శకుడు సాగర్ చంద్ర కు పెద్దగా క్రెడిట్ దక్కలేదు. ఇక ఇప్పడు తమిళ రీమేక్ `వినోదాయ సితం`కు కూడా త్రివిక్రమ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఒరిజినల్ స్క్రిప్ట్ కు భారీ మార్పులు చేసిన త్రివిక్రమ్  ఈ ప్రాజెక్ట్ విషయంలోనూ తనదే పై చేయిగా వ్యవహరిస్తున్నారట.

ఇప్పటికే `భీమ్లానాయక్`తో డైరెక్టర్ ఎవరైనా డామినేషన్ మొత్తం త్రివిక్రమ్ దే అనే కామెంట్ లు వినిపించాయి. తాజాగా `వినోదాయ సితం` రీమేక్ కూడా ఇప్పడు ఇదే కామెంట్ లు మొదలయ్యాయట. మరి సముద్రఖని ఈ డామినేషన్ ని తట్టుకుని ఎలా పవన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాడో అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టుగా చెబుతున్నారు.