Begin typing your search above and press return to search.

నా దృష్టిలో సీతారామశాస్త్రిగారు ఒక అద్భుతం: త్రివిక్రమ్

By:  Tupaki Desk   |   22 May 2022 11:04 AM GMT
నా దృష్టిలో సీతారామశాస్త్రిగారు ఒక అద్భుతం: త్రివిక్రమ్
X
తెలుగు సినిమా గురించి తెలిసిన ఇప్పటి జనరేషన్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియకుండా ఉండదు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఆయన ఒకరు. ముందుగా రచయితగా పరిచయమైన ఆయన ఆ తరువాత తానే మెగాఫోన్ పట్టుకున్నారు.
దర్శకులుగా మారిన రచయితలు త్రివిక్రమ్ కి ముందు .. ఆ తరువాత ఉన్నప్పటికీ ఆ స్థాయిలో సక్సెస్ అయినవారు లేరు. త్రివిక్రమ్ కంటే ముందుగా పాటల కోసమే సినిమాకి వెళ్లేవారు ఉండేవారు. త్రివిక్రమ్ నుంచి ఆయన మాటల కోసమే సినిమాకి వెళ్లేవారు మొదలయ్యారు. ఆయన మాటలు ప్రేక్షకుల హృదయాలలో అంతలా నాటుకుపోయాయి.

తేలికైన పదాలతో నవ్వుల విన్యాసం చేయించే త్రివిక్రమ్, భారమైన సన్నివేశాలకి రాసే సంభాషణలు మనసు లోతులను తాకుతాయి .. కళ్లను తడిచేస్తాయి. అలాంటి త్రివిక్రమ్ ఆయా వేదికలపై మాట్లాడే మాటలు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటాయి. కొంతకాలం క్రితం జరిగిన మా టీవీ అవార్డుల ఫంక్షన్లో సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ చేసిన ప్రసంగం ఎంతోమందిని ఆకట్టుకుంది. సిరివెన్నెల పాటకి సమానంగా త్రివిక్రమ్ తన మాటను తీసుకెళ్లడా అనిపిస్తుంది. అలాంటి ప్రసంగమే మళ్లీ సిరివెన్నెల జయంతి సందర్భంగా త్రివిక్రమ్ చేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్న ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ .. "సీతారామశాస్త్రిగారితో చాలా వెన్నెల రాత్రులు గడిపాను. వెన్నెల లేని ఆ గదిలో ఆయన ధూమ మేఘాల మధ్య ఆయననే చంద్రుడిలా చూశాను చాలా సార్లు. నా సినిమా కోసం రాసినవి మాత్రమే కాదు .. వేరే సినిమాలకి రాసిన పాటలను కూడా నాకు వినిపించేవారు. అర్థరాత్రి వేళలో కాల్ చేసి 'మంచి లైన్ వచ్చింది విను' అని చెప్పేవారు. ఒక కవి పాడుతున్నప్పుడు ఆయన గొంతు అంత బాగా లేకపోయినా ఆయన గుండె అంత గొప్పగా ఉంటుంది.

ఆయన పాడి వినిపించిన పాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఆయనతో కలిసి గడిపిన సమయం గుర్తుపెట్టుకోదగినది అనిపిస్తుంది. ఆయన పాట కంటే ఎత్తైన మనిషి .. ఆ పాట భావం కంటే లోతైన మనిషి. అది మనకి అర్థమైన దానికంటే విస్తారమైన మనిషి. అలాంటి ఒక మనిషితో కొన్ని సంవత్సరాలు గడపడం ఆనందం .. మరికొన్ని సంవత్సరాలు గడపలేకపోవడం బాధాకరం. కొన్ని కావ్యాలకు ముగింపు ఉండకూడదనిపిస్తుంది .. కొన్ని పుస్తకాలకు ఆఖరి పేజీ రాకూడదనిపిస్తుంది .. కొన్ని సినిమాలకి క్లైమాక్స్ చూడకూడదనిపిస్తుంది. సీతారామశాస్త్రిగారు కూడా అలాంటి ఒక కావ్యం .. అలాంటి ఒక పుస్తకం .. అలాంటి ఒక చిత్రం.

ఆయన చలిస్తున్నప్పుడు .. ఆయన జ్వలిస్తున్నప్పుడు మనం ఒక అద్భుతాన్ని చూడగలం. కళ్లకి రంగులు ఉంటాయిగానీ .. కన్నీరుకి రంగుండదు. పదాలను ప్రోగుచేసి మనిషి గుండెకి గుచ్చే ఒక కవిగా నేను ఆయనను చూస్తాను. సముద్రాల .. మల్లాది రామకృష్ణ శాస్త్రి .. వేటూరి .. ఇలా చెప్పుకుంటూ పోతే, తెలుగు సినిమా కవులు అంత తక్కువాళ్లేమీ కాదు. అలాంటివారి వృక్ష చ్ఛాయలో మరో మొక్క మొలవాలంటే దానికి ఎంత బలం ఉండి ఉండాలి .. దానికి ఎంత పొగరుండాలి .. దానికి ఎంత సొంత గొంతుక ఉండి ఉండాలి.

ఆయన తన ఉనికిని చాటుకోవడానికి ఆకాశం వైపు చేతులు చాచి ఎలుగెత్తి అరిచారు. నా ఉఛ్వాసం కవనం అన్నారు .. నా నిశ్వాసం గానం అన్నారు. శబ్దాన్ని సైన్యాన్ని చేశారు .. నిశ్శబ్దంతో యుద్ధం చేశారు. అలాంటి ఒక కవి మన మధ్య లేకపోయినా ఆయన రాసిన అక్షరాలు మన చుట్టూనే తిరుగుతున్నాయి. గొప్ప కవి లక్షణం ఏమిటంటే .. కాలాన్ని ఓడించడం. కవి ధర్మాన్ని పాటించాలిగానీ .. గుండెలో సత్యాన్ని మోస్తుండాలి. అలా సత్యాలను మోస్తూ రావడం వల్లనే ఆయన పాటలు ఇప్పటికీ రిలవెంట్ గా అవిపిస్తున్నాయి.

ఆయన .. నేను చాలాసార్లు వాదులాడుకున్నాం .. ఒకరినొకరం అరుచుకున్నాం. ఇప్పుడు అనిపిస్తోంది అదంతా ఆయనకి నాపై ఉన్న కరుణ .. లేదంటే దయ. లేకపోతే నాలాంటి వాడి మాటలను ఆయన వినడం .. దానికి సమాధానం చెప్పాలనుకోవడం ఆయన గొప్పతనం .. ఆయన విశిష్టత. అద్భుతం జరిగేటప్పుడు మనకి తెలియదు .. జరిగిన తరువాత దానిని మనం గుర్తించవలసిన అవసరం లేదు. సీతారామశాస్త్రి గారు నా దృష్టిలో ఒక అద్భుతం" అంటూ ముగించారు.