ఆర్ఆర్ఆర్‌లో ట్రాజిక్ క్లైమాక్స్?

Sun Mar 07 2021 10:00:01 GMT+0530 (IST)

Tragic climax in RRR?

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలు ఎప్పుడూ సుఖాంతమే అవుతాయి. హీరో చనిపోవాల్సిన పరిస్థితి తలెత్తినా సరే.. ఆ లోటు తెలియనివ్వకుండా మరో పాత్రను ముందుకు తీసుకొస్తాడు. బాహుబలిలో తండ్రి పాత్రను చంపేసినా.. తర్వాత కొడుకును తెరపైకి తెచ్చి కథను సుఖాంతమే చేశాడు. విక్రమార్కుడులోనూ అంతే. ఐతే జక్కన్న నుంచి వస్తున్న కొత్త సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రం కొంత మేర దుఃఖాంతం అవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుండటం గమనార్హం. దుఃఖాంతం అంటే హీరోలిద్దరినీ చంపేయడం ఏమీ ఉండదు. కానీ తమ పోరాటంలో భాగంగా ఆ ఇద్దరూ వైకల్యం పొందుతారట. ఎన్టీఆర్ పాత్రకు కళ్లు పోతే.. రామ్ చరణ్ పాత్ర కాళ్లు కోల్పోతుందని అంటున్నారు. బ్రిటిష్ సైన్యంతో భీకర పోరాటంలో భాగంగా వారికిలా జరుగుతుందని అంటున్నారు. దీని గురించి సామాజిక మాధ్యమాల్లోనూ జోరుగా ప్రచారం నడుస్తోంది.ఐతే దీన్ని ట్రాజిక్ క్లైమాక్స్ లాగా ఫీలవకుండా.. చాలా ఎమోషనల్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం జక్కన్న చేస్తున్నాడని.. ప్రేక్షకులు బాధ కంటే ఎక్కువగా ఉద్వేగానికి గురయ్యేలా సినిమా ముగుస్తుందని సమాచారం. సినిమా రిలీజ్‌కు ఇంకా ఆరు నెలలకు పైగా సమయం ఉండగా.. ఈ దశలో ఈ సమాచారం బయటికి రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రేక్షకులను ముందే ప్రిపేర్ చేయడం కోసమే ఈ క్లైమాక్స్ గురించి ఆర్ఆర్ఆర్ టీం లీకులిచ్చి ఉండొచ్చనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. క్లైమాక్స్ చిత్రీకరణను ఇప్పటికే పూర్తి చేసిన రాజమౌళి.. మిగతా ప్యాచ్ వర్క్ ముగించే పనిలో ఉన్నాడు. కొంత గ్యాప్ తర్వాత రామ్ చరణ్ తిరిగి ఆర్ఆర్ఆర్ సెట్స్‌కు వస్తున్నట్లు సమాచారం. ఆలియా కాంబినేషన్లో అతడిపై కొన్ని రొమాంటిక్ సీన్లతో పాటు పాటను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇంకో నెలా నెలన్నరలో చిత్రీకరణ దాదాపుగా అయిపోతుందని తెలుస్తోంది.