'మిన్నల్ మురళి' ట్రైలర్: గ్లోబల్ పవర్స్ తో లోకల్ సూపర్ హీరో..!

Thu Oct 28 2021 13:02:23 GMT+0530 (IST)

Tovino thomas Minnal Murali Trailer

మలయాళ స్టార్ టోవినో థామస్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. వర్సటైల్ యాక్టర్ నటించిన అనేక సినిమాల తెలుగు వెర్సన్స్ 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు టోవినో హీరోగా నటించిన ''మిన్నల్ మురళి'' అనే సినిమా విడుదలకు సిద్ధమైంది.టోవినో సూపర్ హీరోగా కనిపించనున్న ''మిన్నల్ మురళి'' చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ ఓటీటీ విధానంలో రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.

ఓ సాధారణ యువకుడు ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అసాధారణ శక్తులు పొంది సూపర్ హీరోగా ఎలా మారాడు.. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే కథాంశంతో 'మిన్నల్ మురళి' సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. సూపర్ హీరో తరహా యాక్షన్ తో పాటుగా కామెడీ మరియు లవ్ ని కూడా ఇందులో జత చేశారు.

అతీంద్రీయ శక్తులను ఉపయోగించి దుష్టశక్తుల నుంచి ప్రజలను కాపాడే సూపర్ హీరోల సినిమాలను అందరూ ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అన్ని సూపర్ హీరో సినిమాలు యాక్షన్ ప్రధానంగా ఉంటాయి. కానీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన 'మిన్నల్ మురళి' సినిమా మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తోంది. యాక్టన్ కంటే కూడా ఇందులో ఎంటర్టైన్మెంట్ కి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

మిన్నల్ మురళి ఎక్కడ కనిపించినా సమాచారం ఇవ్వమని పోలీసులు ప్రకటించడం ద్వారా.. మన సూపర్ హీరో ఏదో సమస్యలో ఇరుక్కుంటారని సందేహం కలుగుతోంది. స్పైడర్ మ్యాన్ - బ్యాట్ మ్యాన్ - సూపర్ మ్యాన్ గురించి ఎప్పుడైనా విన్నవా? అని ఓ పిల్లాడు అడుగగా.. ఎవరు వారంతా? అని టోవినో అడగడం నవ్వు తెప్పిస్తుంది.

విభిన్నమైన పాత్రలతో అలరించే టోవినో థామస్.. ఈ చిత్రంలో లోకల్ సూపర్ హీరోగా ఆకట్టుకుంటున్నారు. ఇందులో గురు సోమ సుందరం - హరిశ్రీ అశోకన్ - అంజు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. ''మిన్నల్ మురళి'' చిత్రానికి బేసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించారు. 'బెంగుళూరు డేస్' చిత్రాన్ని నిర్మించిన సోఫియా పాల్.. ఈ సినిమాని వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ పై నిర్మించారు.

షాన్ రహమాన్ - సుశీన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ అందించగా.. వ్లాద్ రిమ్ బర్గ్ యాక్షన్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మలయాళ సినిమా స్థాయిని పెంచే విధంగా హై టెక్నికల్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమా రూపొందింది. మలయాళంతో పాటుగా తెలుగు తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ''మిన్నల్ మురళి'' సినిమా.. టోవినో థామస్ కు సూపర్ సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.