టాప్ స్టోరి: అసలు ఈ శుక్రవారానికి ఏమైంది?

Thu Jan 21 2021 12:26:14 GMT+0530 (IST)

Top Story: What actually happened this Friday Releases?

శుక్రవారం వస్తోంది అంటే నాలుగైదు సినిమాలు పోటీపడేందుకు రెడీగా ఉండేవి. వారం వారం థియేటర్ల షేరింగ్ విషయమై కొంత చర్చ నడిచేది. కానీ కరోనా క్రైసిస్ తర్వాత అంతా మారిపోయింది. ఇప్పుడు ఎవరూ శుక్రవారం గురించి మాట్లాడడం లేదు. సజావుగా రిలీజవ్వడం గురించే మాట్లాడుతున్నారు. మొన్న సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజై చక్కని వసూళ్లను సాధించడం హోప్ పెంచింది. అయితే ఈ శుక్రవారం రిలీజ్ లు ఎన్ని? అంటే ఊహించని షాక్ తప్పలేదు. ఫ్రైడే జీరో డేగా మిగిలింది.ఇది ఊహించనిది. జనవరి 22 (శుక్రవారం) రిలీజులు ఏవీ లేకపోవడం ఆశ్చర్యపరిచింది. ఆహాలో `సూపర్ ఓవర్` అనే సినిమా విడుదల  మినహా ఇండస్ట్రీ అంతా ఈ శుక్రవారాన్ని లైట్ తీసుకున్నారు. అయితే జనవరి 23న(శనివారం) ఓ సినిమా రిలీజవుతోంది. అది అల్లరి నరేష్ నటించిన  `బంగారు బుల్లోడు`. అయితే అల్లరోడి ఫోకస్ అస్సలు ఈ సినిమా మీద ఉన్నట్టు లేదు. అస్సలు ఎలాంటి క్రేజ్ లేని సినిమాగా మిగిలిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. నరేశ్ ఈ సినిమా కంటే `నాంది` మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రచారంలో స్పీడ్ లేకపోవడంతో ఈ శుక్ర శనివారాల్లో అరకొర వాటిపైనా అస్సలు జనాల ఫోకస్ నిల్.

జనవరి 29 శుక్రవారం రిలీజ్ లు ఏవైనా ఉన్నాయా? అన్నది ఆరా తీస్తే.. యాంకర్ ప్రదీప్ కథానాయకుడిగా నటించిన `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?` విడుదల కానుంది. ప్రచారం పరంగా ఈ సినిమా విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి సౌండ్ లేదు. గీత ఆర్ట్స్ ఈ సినిమాను పంపిణీ చేస్తోంది. దాదాపుగా 200 థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అవుతుందని తెలుస్తోంది. నేడు విజయ్ దేవరకొండ రిలీజ్ చేసే ట్రైలర్ తో హైప్ పెరుగుతుందేమో చూడాలి.

మరో వారంతోనే జనవరి ముగుస్తుంది. అటుపై ఫిబ్రవరి లో రిలీజుల మాటేమిటి? అంటే.. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన `జాంబీ రెడ్డి` రిలీజవుతోంది. నవతరం హీరో తేజ సజ్జ నెమ్మదిగా షైన్ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఊపు అంతగా పెరగలేదు. ఈ మూవీ బడ్జెట్ అదుపు తప్పిందని.. కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలుస్తుందని గాసిప్పులు వినిపిస్తున్నాయి. దాదాపు 10 కోట్లు పెట్టేయడంతో అంత పెద్ద మొత్తం రాబట్టగలరా?  జనాల్నిని పుల్ చేయగలరా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

వైష్ణవ్ తేజ్ -కృతి శెట్టి జంటగా నటించిన `ఉప్పెన` పాటలు బ్లాక్ బస్టర్ సాధించడమే గాక టీజర్ వైరల్ గా దూసుకెళ్లడంతో  ప్రచారం వేడెక్కింది. ఫిబ్రవరి 5న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఉప్పెన బడ్జెట్ పరంగా అదుపు తప్పిందన్న గుసగుసా మరో వైపు వినిపిస్తోంది. కాస్ట్ ఫెయిల్యూర్ కాకూడదంటే కుమారి 21 ఎఫ్ లా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ఆది నటిస్తున్న శశి కూడా రిలీజ్ బరిలో ఉంది.  ప్రస్తుతం సిద్ శ్రీరామ్ పాడిన పాట కారణంగా జనాల్లోకి వెళ్లింది. సినిమా బాగుంటే ఆదిని ఎప్పటినుంచో ఊరిస్తున్న హిట్ రావచ్చన్న అంచనా ఉంది. అయితే ఎవరి రాత ఎలా ఉంది? అన్నది ఇప్పుడే చెప్పలేం. సంక్రాంతి బరిలో రిలీజైనవి క్రేజు ఉన్న సినిమాలు. ఇకపై రానున్నవి హైప్ తో ఒరిజినల్ కంటెంట్ లో క్వాలిటీతో హిట్టు కొట్టుకు రావాల్సి ఉంటుంది.