Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: చ‌ప్ప‌రించేస్తున్న డిజిట‌ల్

By:  Tupaki Desk   |   13 Nov 2019 9:27 AM GMT
టాప్ స్టోరి: చ‌ప్ప‌రించేస్తున్న డిజిట‌ల్
X
చిన్న‌ సినిమా తీయ‌డం ఈజీ... కానీ దాన్ని మార్కెట్ చేయాలంటే అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. థియేట‌ర్లు దొర‌క్క‌.. ఈ త‌ర‌హా సినిమాలు రిలీజ్ చేయాలంటే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు త‌ల ప్రాణం తోక‌కి వ‌స్తోంది. దీంతో చాలా మంది మేక‌ర్స్ చిన్ని సినిమా స్థానంలో వెబ్ సిరీస్ ల బాట ప‌డుతున్నారు. వీటికి జీ5.. అమెజాన్ ప్రైమ్ ఆల్ట్ బాలాజీ వంటి డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ లు ముందుకు రావ‌డంతో ఇప్పుడు వెబ్ సిరీస్ ల సీజ‌న్ న‌డుస్తోంది. దీన్ని ప‌క్కాగా క్యాష్ చేసుకోవాల‌ని లోక‌ల్ మార్కెట్ పై డిజిట‌ల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ క‌న్నేసింది. అందులో భాగంగా 'ల‌స్ట్ స్టోరీస్‌'ని లోక‌ల్ లాంగ్వేజెస్ లో నిర్మిస్తుండ‌డం సంచ‌ల‌నంగా మారింది. డిజిట‌ల్ లో ఇది తొలి కీల‌క అడుగు అని ఎన‌లిస్టులు విశ్లేషిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఇప్ప‌టికే 5.1 కోట్ల నిక‌ర లాభంలో 466.70 కోట్ల ట‌ర్నోవ‌ర్ ని సాధించి లాభాల్లో ప‌య‌నిస్తోంది. దీని షేర్ ని ఇండియాలో మ‌రింత పెంచుకోవాల‌న్న ఆలోచ‌న‌ల్లో భాగంగా నెట్ ఫ్లిక్స్ తాజాగా లోక‌ల్ మార్కెట్ పైనా క‌న్నేసింది. ఇక్క‌డి లోక‌ల్ కంటెంట్ ని ప్రోత్సిహిస్తూ తెలుగులో వ‌రుస వెబ్ సిరీస్ ల‌ని నిర్మించాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే 'ల‌స్ట్ స్టోరీస్‌'ని తెలుగులో నిర్మిస్తోంది. సంక‌ల్ప్ రెడ్డి దర్శ‌క‌త్వంలో ఇషా రెబ్బా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సిరీస్ నిన్న‌నే మొద‌లైంది.

కేవ‌లం తెలుగులో మాత్ర‌మే కాదు.. దేశ వ్యాప్తంగా వున్న మిగ‌తా ప్రాంతీయ భాష‌ల్లోనూ దీన్ని నిర్మిస్తోంది నెట్‌ఫ్లిక్స్‌. అమెరికా కాలిఫోర్నియాకు చెందిన నెట్ ఫ్లిక్స్ 2016లో భార‌తీయ మార్కెట్ లోకి ప్ర‌వేశించింది. మొద‌ట బాలీవుడ్ వ‌ర‌కే ప‌రిమిత‌మైనా ఆ త‌రువాత లోక‌ల్ లాంగ్వేజ్ ల‌పైనా దృష్టి సారించింది. రానున్న రోజుల్లో డిజిట‌ల్ ప్ర‌పంచం మ‌రింతగా విస్త‌రించే అవ‌కాశం వుంద‌ని ముందే ప‌సిగ‌ట్టిన నెట్ ఫ్లిక్స్ రానున్న రోజుల్లో బిలియ‌న్ డాల‌ర్ డిజిట‌ల్ బిజినెస్ ని కొల్ల‌గొట్టాల‌ని ప్లాన్ చేస్తోంది. ప‌రిస్థితులు కూడా అనుకూలంగా వుండ‌టంతో భారీ స్థాయిలోనే లోక‌ల్ మార్కెట్ ని నెట్‌ఫ్లిక్స్ కొల్ల‌గొట్టే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. డిజిట‌ల్ విప్ల‌వంతో ఇప్పుడు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు విస్త్ర‌తంగా అవ‌కాశాలు పెరిగాయ‌న్న విశ్లేష‌ణ మ‌రోవైపు సాగుతోంది.