భారీ ప్రాజెక్ట్స్ కోసం చేతులు కలిపిన అగ్ర నిర్మాణ సంస్థలు..!

Wed Oct 05 2022 19:01:30 GMT+0530 (India Standard Time)

Suresh Production,Sprit Media And Venkateswara Cinemas Join Hands For Big Project

తెలుగు సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సత్తా చాటుతున్న నేపథ్యంలో.. మన ఫిల్మ్ మేకర్స్ అంతా అదే స్థాయిలో సినిమాలు రూపొందించడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ అగ్ర నిర్మాణ సంస్థలు చేతులు కలుపుతున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్టుగా టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు రెండు భారీ చిత్రాల కోసం జతకడుతున్నాయి.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న సురేష్ ప్రొడక్షన్స్ మరియు గతేడాది ప్రొడక్షన్ లోకి దిగిన ఏషియన్ గ్రూప్ ఇప్పుడు నిర్మాణ భాగస్వాములుగా మారుతున్నారు. వీరితో పాటుగా రానా దగ్గుబాటి మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు కూడా కలుస్తున్నారు. వీరంతా కలిసి రెండు ప్రాజెక్ట్ లు చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.

నేడు దసరా సందర్భంగా డి సురేష్ బాబు యొక్క సురేష్ ప్రొడక్షన్స్ - రానా కు చెందిన స్పిరిట్ మీడియా మరియు సునీల్ నారంగ్ & పుస్కుర్ రామ్మోహన్ రావు యొక్క శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP తమ అసోసియేషన్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు చిత్రాల వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని నిర్మాతలు తెలిపారు.

''రాబోయే 2 చిత్రాల సంయుక్త నిర్మాణం కోసం డి.సురేష్ బాబు - రానా దగ్గుబాటి - సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్మోహన్ రావు తమ తమ నిర్మాణ సంస్థలైన సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - స్పిరిట్ మీడియా మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP – ఏషియన్ గ్రూప్) సహకారాన్ని ప్రకటించడానికి సంతోషిస్తున్నాము. ఈ సినిమాలకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. సినిమాస్ లో కలుద్దాం'' అని ప్రకటనలో పేర్కొన్నారు.

కొన్నేళ్ళుగా ఎగ్జిబిటర్స్ గా భాగస్వాములుగా ఉన్న ఆసియన్ గ్రూప్ మరియు సురేష్ ప్రొడక్షన్స్.. ఎగ్జిబిషన్ రంగంలో తమదైన ముద్ర వేశారు. గతేడాది ఏషియన్ గ్రూప్ వారు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ ఏర్పాటు చేసిన సినిమాల నిర్మాణంలోకి వచ్చారు.

ప్రస్తుతం రెండు నిర్మాణ సంస్థలు కూడా వేర్వేరుగా ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి వివిధ ప్రాజెక్ట్ లను రూపొందిస్తున్నాయి. అలానే కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ''ప్రిన్స్'' వంటి ద్విభాషా చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో రానా సహకారంతో మరో రెండు ప్రాజెక్ట్స్ నిర్మించడానికి ప్లాన్స్ చేసుకున్నారు.

కంటెంట్ రిచ్ సినిమాలకు పేరుగాంచిన అగ్ర నిర్మాణ సంస్థలు.. ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్ట్స్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. వీరి కలయికలో ఆసక్తికరమైన ప్రాజెక్టులు చేస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాబోయే రోజుల్లో ఈ సినిమాల గురించిన వివరాలు ప్రకటించబడతాయి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.