Begin typing your search above and press return to search.

కరోనాపై యుద్ధంలో నిర్మాణ సంస్థలకు బాధ్యత లేదా..?

By:  Tupaki Desk   |   5 April 2020 3:30 AM GMT
కరోనాపై యుద్ధంలో నిర్మాణ సంస్థలకు బాధ్యత లేదా..?
X
కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశ దేశాలను దాటుకుంటూ వచ్చి మన పక్కన చేరింది. ఈ వైరస్ ఎప్పుడు ఎవరికి ఎలా సోకుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకగా వేలమంది ప్రాణాలను కోల్పోయారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే కరోనా కేసులలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీల మీద కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా నమోదు కావడంతో సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీని ప్రభావం అన్ని రంగాల మీద పడింది. ఈ నేపథ్యంలో దినసరి కూలీలు - శ్రామికులు - కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీనికి సినీ ఇండస్ట్రీ కూడా మినహాయింపు కాదు. సినీ ఇండస్ట్రీ మీద ఇంకా ఎక్కువగా పడింది.

వీరిని ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోడానికి సినీ పరిశ్రమ నుండి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా సాయం చేస్తున్నారు. సినీ కార్మికులను ఆదుకోడానికి 'కరోనా క్రైసిస్ ఛారిటీ' ఏర్పాటు చేసి వారికి భరోసా కలిగిస్తున్నారు. అయితే దీనికి టాలీవుడ్ హీరోలు మాత్రమే సహాయం చేయగా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి పెద్దగా సపోర్ట్ అందలేదనే చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీ మీద బ్రతుకుతూ... సినిమా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ నామమాత్రపు - ఉడతా భత్యం సహాయలేంటో అర్థం కాదు. సర్లే ఎంతో కొంత సహాయం చేస్తున్నారులే అని సర్దుకుని పోవడమే మనం చేయగలిగింది. వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలను తీస్తారు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయమంటే మాత్రం చేతులు రావు ఈ ప్రొడక్షన్ హౌసెస్ కి. ఒక్కసారి కరోనా క్రైసిస్ ఛారిటీకి ఇండస్ట్రీలో ఉన్న వివిధ పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ప్రకటించిన విరాళాలు ఎంతో చూస్తే మనకే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. కానీ, ఇంత డొనేట్ చేయమని మనం డిమాండ్ చేయలేము కదా... సినీ ఇండస్ట్రీ పడుతున్న కష్టాన్ని చూసి వాళ్లే ముందుకు రావాలిగానీ. సర్లే వీళ్ళు ఎంతో కొంత డొనేట్ చేశారు, అస్సలు సహాయం చేయాలనే ఊసే లేని మిగతా నిర్మాణ సంస్థల కంటే ఇవి కొంచెం బెటరే కదా అని సరిపెట్టుకోవడమే..!