1000 కోట్ల క్లబ్ పై కన్నేసిన టాప్ 5 మూవీస్

Wed Jun 29 2022 08:00:01 GMT+0530 (IST)

Top 5 Movies Looking Over 1000 Crore Club

రణబీర్ కపూర్ నటించిన రెండు పాన్ ఇండియా సినిమాలు ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాయి. శంషేరా- బ్రహ్మాస్త్ర లాంటి భారీ విజువల్ ఫీస్ట్స్  కి  జూలై- సెప్టెంబర్ లో డేట్స్ కూడా లాక్ అయ్యాయి. ఈ మధ్యలోనే అక్షయ్ కుమార్ .. అమీర్ ఖాన్ లాంటి పెద్ద స్టార్లు నటించిన సినిమాలు వస్తున్నాయి. రక్షాబంధన్.. లాల్ సింగ్ చద్దా లాంటి సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే వీటిలో ఏ సినిమా 1000 కోట్ల క్లబ్ అందుకుంటుంది? అంటే కాన్ఫిడెంట్ గా చెప్పలేని సన్నివేశం కనిపిస్తోంది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్టయినా 500కోట్ల రేంజును మించే సన్నివేశం ఉంటుందా? అన్న ప్రశ్న ట్రేడ్ లో ఉత్పన్నమైంది. నిజానికి వీళ్లంతా పెద్ద హీరోలే. కానీ సౌత్ లో ఆదరణ ఎంత? అన్నదే సస్పెన్స్ గా మారింది. ఇక్కడ ఆదరిస్తేనే వెయ్యి కోట్ల క్లబ్ సాధ్యమవుతుందని కూడా విశ్లేషిస్తున్నారు.అయితే అందుకు భిన్నంగా సౌత్ లో నార్త్ లో ఆదరణ దక్కించుకుంటున్న ప్రభాస్ - మాధవన్ నటించిన సినిమాలు ఇప్పుడు రేసులోకి వచ్చాయి. ఇవన్నీ పాన్ ఇండియా కేటగిరీలో వచ్చే సినిమాలే కావడంతో 1000 కోట్ల క్లబ్ గురించి మరోసారి చర్చ ఆసక్తిని కలిగిస్తోంది. పలు బాలీవుడ్ మీడియాల్లో ఐదు సౌతిండియన్ సినిమాలు పాన్ ఇండియా బరిలో సత్తా చాటగలవన్న విశ్లేషణ సాగడం ఆసక్తిని పెంచుతోంది.

హిందీ మీడియా విశ్లేషణ ప్రకారం..  గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణ భారత సినిమా భారతీయ ప్రేక్షకులలో ప్రజాదరణను అంతకంతకు పెంపొందించుకుంటోంది. సౌత్ ఇండియన్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ఎలా షేకైందో చూసాం. ప్రజలు సౌత్ కంటెంట్ ను ఇష్టపడుతున్నారు. పుష్ప -KGF 2- ఆర్.ఆర్.ఆర్ వంటి చిత్రాలు ఇటీవల విడుదలై హిందీ బాక్సాఫీస్ తో పాటు OTT ప్లాట్ ఫారమ్ లను కూడా శాసించాయి. ఇవి కంటెంట్ చాలా కీలకం అని నిరూపించాయి.

ఇక ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రీమేక్ ల కంటే ఉత్తరాది ఆడియెన్ ఆనందించగలిగే గొప్ప కంటెంట్ ఉన్న చిత్రాలు ఒక ఐదు ఉన్నాయి!  వాటి వివరాల్ని పరిశీలిస్తే..వీటిలో రెండు ప్రభాస్ నటిస్తున్నవే ఉన్నాయి. ఆదిపురుష్ 3డి - సలార్ చిత్రాలు హిందీ బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం.  ఇవి బాక్సాఫీస్ వద్ద ఇంటా బయటా దుమ్ము రేపుతాయన్న అంచనా వెలువడింది. ప్రభాస్ చిత్రాలు రెండూ 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు ఆస్కారం ఉందని ప్రముఖ బాలీవుడ్ మీడియా విశ్లేషించింది. ఈ రెండు చిత్రాల్లో బాలీవుడ్ స్టార్లు నటిస్తుండడంతో అది ఉత్తరాది మార్కెట్ కి ప్లస్ కానుంది.

మ్యాడీ అలియాస్ మాధవన్ నటించిన రాకెట్రీ చిత్రం సరిగ్గా క్లిక్కయితే పాన్ ఇండియా కేటగిరీలో భారీ వసూళ్లను సాధిస్తుందని కూడా సదరు కథనం వెల్లడించింది. మాధవన్ కి ఉత్తరాదినా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. పైగా రాకెట్రీ అనేది ఒక సైంటిస్ట్ బయోపిక్ కాబట్టి అన్నిచోట్లా ఆదరణ దక్కించుకుంటుందని విశ్లేషించింది. ఈ సినిమా కూడా కమల్ హాసన్ విక్రమ్ తరహాలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని కూడా అనలైజ్ చేయడం విశేషం.

అలాగే విజయ్ దేవరకొండ లైగర్ పైనా బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీని కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాథ్- ఛార్మి బృందం పాన్ ఇండియా కేటగిరీలో చేర్చారు. విజయ్ కి ఇది హిందీలో డెబ్యూ మూవీ అయినా అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు కరణ్ బృందాలు చాలా ముందస్తు ప్రణాళికతో ఉన్నాయి. ఇక మూవీ కంటెంట్ కనెక్టయితే పుష్ప తరహాలో సంచలనాలు సృష్టిస్తుందని కూడా విశ్లేషిస్తున్నారు. ఇటు సౌత్ తో పాటు అటు ఉత్తరాదినా విజయ్ దేవరకొండకు భారీ ఫాలోయింగ్ ఉంది. హిందీ బ్యూటీ అనన్య పాండే క్రేజ్ ఉత్తరాది కలెక్షన్లకు ప్లస్ కానుంది. ఈ మూవీ 500 కోట్ల క్లబ్ ను అధిగమించే ఛాన్సుందని కూడా కొన్ని బాలీవుడ్ మీడియాలు కథనాలు అల్లడం ఉత్కంఠను పెంచుతోంది. ఈ మధ్యలోనే మాలీవుడ్ కోలీవుడ్ లో భారీ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటిలో ఏదైనా మూవీ పాన్ ఇండియా రేస్ లో సంచలనం సృష్టిస్తుందేమో చూడాలని కూడా హిందీ మీడియా కథనాలు ఉటంకించడం ఆసక్తిని కలిగించింది.